17-04-2025 01:12:46 AM
లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థుల వినూత్న నిరసన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ పద్ధతుల్లో తరగతి గదిని చల్లగా మార్చడానికి ప్రయోగం చేస్తున్నానని చెప్పి ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపల్ ప్రత్యూష వత్సల ఇటీవల తరగతి గోడలకు పేడ పూసిన సంగతి తెలిసిందే. ఈ చర్యను కొందరు విద్యార్థులు సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
మంచి పనికి పూనుకున్న ప్రిన్సిపల్ ప్రత్యూష తన గదిలో మాత్రం గోడకు పేడ పూయకుండా ఏసీలోనే ఉంటున్నారంటూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) అధ్యక్షుడు రోనక్ ఖత్రి నేతృత్వంలో విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం ప్రిన్సిపల్ కార్యాలయంలోకి వెళ్లిన విద్యార్థి నేతలు కార్యాలయం గోడకు ఆవు పేడను పూశారు.
‘ఇప్పుడు ప్రిన్సిపల్ గదికి కూడా పేడను పూశాం కాబట్టి చల్లగా ఉంటుంది. ఈ గదిలో ఉన్న ఏసీని తీసేసి విద్యార్థులకు ఇచ్చేస్తారు. ఆవు పేడతో వచ్చే చల్లదనంలోనే ప్రిన్సిపల్ మేడమ్ ఎండాకాలంలో విధులు నిర్వహిస్తారని నమ్ముతున్నాం’ అని రోనక్ ఖత్రి పేర్కొన్నారు.
విద్యార్థుల సమ్మతి లేకుండా తరగతి గోడలకు పేడ పూయడాన్ని తప్పుబట్టారు. పేడ వాసన వల్ల విద్యార్థులు తరగతి గదిలో కూర్చోలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే ప్రిన్సిపల్ మేడమ్ ఇంట్లో చేసుకోవాలని.. అనవసరంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.