07-01-2026 09:00:56 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): 10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనిజిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు, టూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శత శాతం సాధన 2.0 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు పర్యవేక్షించాలని, గైర్హాజరు అయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
10వ తరగతిలో ఈ 3 నెలలు కీలక సమయం అని, సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులు ఇంటి వద్ద మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలా పేరెంట్స్ కమిటీ సమావేశంలో తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చి అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్. ఎ.- 1 పరీక్షలు ఉత్తీర్ణతను బేరీజు వేసుకోవాలని, సబ్జెక్టులలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు విద్యాబోధన చేయాలని తెలిపారు.
ముఖ్యంగా ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, తరగతిగదులలో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు వాడకూడదని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రణాళికా సమన్వయకర్త శ్రీనివాస్, కస్తూరిబా గాంధీ విద్యాలయాల ప్రత్యేక అధికారులు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.