27-12-2025 12:37:13 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, డిసెంబరు 26 (విజయ క్రాంతి): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, అందుకు చెకుముకి సంబరాలు, సైన్స్ ఫెయిర్ దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పద్మ నగర్ లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో ఈనెల 26 నుండి 28 వరకు రాష్ట్రస్థాయి చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ హాజరై సంబరాలను ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతి అంశాన్ని శాస్త్రీయ కోణంలో ఆలోచించాలని అన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్, చెకుముకి సంబరాలు వంటివి ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలను చెరిపివేస్తూ సైన్స్ కోణంలో అవగాహన కల్పిస్తున్న జనవిజ్ఞాన వేదిక సేవలు అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి పి.మనీంద్రం, సీసీఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు, నిమ్స్ మాజీ డైరెక్టర్ ప్రసాదరావు, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు, చక్రపాణి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జె వి వి వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, జె వి వి నాయకులు ఆనంద్ కుమార్, వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.