calender_icon.png 25 December, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

25-12-2025 12:01:22 AM

టీయూ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండమల్ల శ్రీనివాస్ 

సంస్థాన్ నారాయణపూర్, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల గౌరవం - తెలంగాణ ఆత్మగౌరవం నినాదంతో హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఈనెల 28న నిర్వహిస్తున్న ఉద్యమ కళాకారుల ధూంధాం బహిరంగ సభ కరపత్రాన్ని సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టియు జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండుమల్ల శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగాల తెలంగాణలో అమరుల త్యాగానికి గౌరవం దక్కలేదని స్వరాష్ట్రం కోసం అన్ని వదులుకొని ఉద్యమించిన ఉద్యమకారులకు ఉద్యోగం,ఉపాధి లేక రోడ్డున పడ్డ పరిస్థితిని చూస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు, కళాకారులకు అన్యాయం జరిగిందని పోరాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు మద్దతుగా నిలిచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ఉద్యమకారులకు కల్పించే అవకాశాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం పెట్టడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యమకారులకు, కళాకారులకు ఇచ్చిన హామీలపై అతి,గతి లేదన్నారు.ఉద్యమకారులకు 250 గజాల ప్లాటు, నెలకు గౌరవ వేతనం,గుర్తింపు కార్డులు,ఉద్యోగం కల్పించాలన్నారు.

ఈనెల 28న హైదరాబాద్ వేదికగా ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, కళాకారులు పెద్ద ఎత్తున ఈనెల 28న హైదరాబాద్లో నిర్వహిస్తున్న బషీర్ బాగ్ తెలంగాణ బహిరంగ సభకు తరలి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమ, కళాకారులకు మద్దతుగా గ్రామ ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి,కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపన అధ్యక్షులు చిలువేరు అంజయ్య,అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కట్ట గాలిభ్ రోషన్,ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షులు వలిగొండ యాదయ్య,పులమోని బిక్షపతి,కట్ట భౌరేష్, వలిగొండ శ్రీనివాసులు,గుండమల్ల లింగస్వామి, మందుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.