21-12-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు
తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత 12,702 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. స్థానిక సంస్థల్లో మొదటి పాలనా వ్యవస్థ అయిన గ్రామపంచాయతీలు రాష్ర్ట అభివృద్ధిలో కీలకమైన భాగస్వామిగా వ్యవహ రిస్తాయి. తెలంగాణ రాష్ర్టంలో 61 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తుంది. కాబట్టి వారి ప్రాథమిక అవసరాలు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలన్నీ గ్రామ పాలనా వ్యవస్థ ద్వా రానే అందించబడతాయి.
తెలంగాణ రా ష్ర్టం ఏర్పాటైన తరువాత 2019లో మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగా యి. బలమైన సంస్థాగత నిర్మాణం కో సం, గ్రామస్థాయి నుంచి పార్టీ పునాదుల ను బలంగా నిర్మించుకోవడానికి రెండో పర్యాయం జరిగిన గ్రామపంచాయతీ ఎ న్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో పోటీపడ్డాయి.
బలబలాలు తారుమారు..
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. 2019లో మొదటిసారి జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ, 2025 లో రెండో పర్యాయం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీలే మె జార్టీ గ్రామపంచాయతీల్లో గెలుపును అందుకున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రధాన పోటీ జరిగింది. నేడు మాత్రం రాష్ర్టంలో మా రిన రాజకీయ పరిస్థితుల్లో మొదటిసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రి ముఖ పోటీ జరిగిందని చెప్పొచ్చు. 2019 లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ 7,774 గ్రామ పంచాయతీలను (60 శాతం), కాంగ్రెస్ పార్టీ 2,079 గ్రామ పంచాయతీలను (21 శాతం), భారతీయ జనతా పార్టీ కేవలం 163 గ్రామ పంచాయతీలను (1.2 శాతం) గెలుచుకున్నాయి.
ఇక 2025లో 12, 702 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. అధికార కాంగ్రెస్ పార్టీ 7,135 గ్రామ పంచాయతీల్లో (56 శాతం), ప్ర ధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ 3,508 గ్రామ పంచాయతీల్లో (28 శాతం), మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ 674 గ్రామపంచా యతీల్లో (5.3 శాతం) గెలుపొందితే.. లెఫ్ట్ పార్టీలతో కలిపి స్వతంత్రులు, పార్టీల తిరుగుబాటుదారులు 1,385 గ్రామపంచాయ తీల్లో గెలుపొందారు. ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికలలో పార్టీల బలాబలాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ ఫలితాలలో పై చేయి సాధిస్తే ఈ పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గ్రామపంచా యతీలను కైవసం చేసుకుని పంచాయతీ ఎన్నికల్లో తన పట్టును నిలుపుకుంది.
కాంగ్రెస్‌దే మెజార్టీ!
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే పంచాయతీలను గెలుచుకున్నాయి. 90 శాతం గ్రామ పం చాయతీలను గెలుచుకోవాలనే ల క్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 56 శాతం గ్రామ పంచాయతీలలోనే గెలుపొందింది. కానీ పార్టీ తిరుగుబాటు దారులుగా గెలుపొందిన 808 పంచాయతీ ప్రెసిడెంట్‌ల తో కలిపి కాంగ్రెస్ పార్టీ 66 శాతం గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అరవై శాతం గ్రామపంచాయతీల్లో విజయం సాధించగా.. వాస్తవంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో విజయం సాధించలేదనే చెప్పా లి.
ఏకగ్రీవంగా గెలిచిన 1,205 గ్రామ పంచాయతీల్లో మెజార్టీ పంచాయతీలు అధికార పార్టీ ఖాతాలో పడటం వల్ల గణనీయమైన సంఖ్యలో అధికార పార్టీ పంచా యతీలను గెలుచుకున్నట్లుగా కనిపిస్తున్నది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని 2,079 నుంచి 7,135కు పెంచుకున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఆరు జిల్లాల్లో ముఖ్యమంత్రి బహిరంగ సభలు నిర్వహించినప్పటికీ.. గతంలో బీఆర్‌ఎస్ గెలుచు కున్న 7,774 గ్రామ పంచాయతీల సంఖ్య ను కాంగ్రెస్ పార్టీ అందుకోలేకపోవటం ఆ పార్టీని కాస్త నిరుత్సాహపరిచిందని చెప్పొచ్చు.
ఫుంజుకున్న విపక్షాలు..
శాసనసభ ఎన్నికల నుంచి ఎదురవుతున్న వరుస ఓటములతో డీలా పడిన బీఆర్‌ఎస్ పార్టీ పంచాయితీ ఎన్నికల్లో ఎ లాంటి అంచనాలు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగింది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 3, 508 గ్రామ పంచాయతీలు గెలుపొందడంపై ఆ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఖమ్మం న ల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే బా గుండేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమయ్యింది.
ఈ ఫలితాలను అంచనా వేసిన తర్వాత ఇంకా గ్రామాల్లో తాము పట్టు కోల్పోలేదన్న అభిప్రాయానికి బీఆర్‌ఎస్ పార్టీ వచ్చినట్లుగా కనప డుతుంది. గ్రామాల్లో పెద్దగా బలం లేదని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన బలా న్ని పెంచుకుందనే చెప్పాలి. గతంలో ఆ పార్టీ 163 గ్రామపంచాయతీలను మాత్ర మే గెలుచుకుంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో తన బలాన్ని 674కు పెంచుకోగలి గింది.
ఈ ఫలితాలపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇటీవల ఉత్తర తెల ంగాణలో బలం పెరిగినప్పటికీ బీజేపీ అనుకున్న స్థాయిలో గ్రామ పంచాయతీలను గెలవలేకపోయింది. రాష్ర్టవ్యాప్తంగా ఒక్క ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో తప్ప ఆ పార్టీ ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ స్థా యిలో స్థానాలు గెలవలేకపోయింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మూడో స్థానానికి పరిమితం కావడంతో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోవ టానికి బలం లేకుండా పోయింది. మొ త్తంగా తెలంగాణ రాష్ర్ట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు అధికార పార్టీ అద్భుత విజయం సాధించిందని చెప్పలేము. అలా గే ప్రతిపక్షాలు కూడా పేలవమైన ఫలితా లు సాధించలేదు కదా అనే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.
గ్రామ స్వరాజ్యం దిశగా..
రాజకీయాలు ఎలా ఉన్నా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు నిజాయితీగా, అంకితభావంతో, పూర్తి సామర్థ్యంతో గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలి. సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళలు, యువత గ్రా మాల రూపురేఖలను మార్చగలిగినప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. గంగదేవిపల్లి అభివృద్ధి నమూనాని ఆదర్శంగా తీసుకొని, ఆళ్లగడపలో మాజీ సర్పంచ్ పాండురంగారావు నెలకొల్పిన ప్రయోగాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామ పాలకులు పనిచేసినప్పుడే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామ పాలకులపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.
పార్టీ రహితంగా జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా రాజకీయ రంగులు అద్ది రాజకీయాలు చేసి ఎన్నికలలో గెలుపు కోసం అడ్డగోలుగా డబ్బు లు, మద్యం పంచినవారు ప్రజలని ప్రలోభాలకు గురిచేసి గెలిచినవారు నిజాయి తీగా, అవినీతి రహితంగా, అంకితభావం తో ఎలా పనిచేస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరొకవైపు రాష్ర్ట ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధు లు- అధికారాలు బదలాయించకుండా గ్రా మ పాలకుల చేతులు కట్టి వేయడంతో పంచాయతీలు నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో వెనకబడి పోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భం గా రాజకీయ అంశాలు, అజెండాలు మా త్రమే తెరపైకి వచ్చాయి. కానీ ఎక్కడా గ్రా మాలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చ కు రాకపోవటం కొసమెరుపు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీలు గెలిచాయి కానీ ఎప్పటిలాగానే ప్రజలు ఓడిపోతారు!
వ్యాసకర్త సెల్: 9885465877