01-11-2025 12:00:00 AM
గద్వాల, అక్టోబర్ 31 : దేశ సమగ్రతను కాపాడేందుకు అవిశ్రాంత కృషిచేసి ఉక్కుమనిషిగా పేరుగాంచిన దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు పిలుపునిచ్చారు.
దేశ తొలి ఉప ప్రధానిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా గద్వాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం నుంచి రైల్వే ఫ్లైఓవర్, అంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు తో పాటు ఇతర అతిధులు, పెద్ద ఎత్తున విద్యార్థులు 2కే రన్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడేందుకు రన్ ఫర్ యూనిటీ దోహదపడుతుందన్నారు.
మన దేశంలో భిన్న మతాలు, జాతులు, వివిధ భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పలు రకాలుగా ఉన్నప్పటికీ వారి ఆచార, వ్యవహారాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూనే అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా జీవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, ప లువురు ప్రజాప్రతినిధులు, సిఐలు, ఎస్త్స్రలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులుపాల్గొన్నారు.