calender_icon.png 12 July, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం

12-07-2025 12:50:38 AM

  1. సీఎం, పీసీసీ చీఫ్, బీసీ మంత్రులకు ధన్యవాదాలు
  2. బిల్లు ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం నిరాశే మిగిల్చింది 
  3. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు పెంపు అభినందనీయం 
  4. అగ్రకులాలు సహకరించకుంటే ఈడబ్ల్యూఎస్ రద్దుకు రోడ్డెక్కుతాం
  5. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): క్యాబినెట్ సమావేశంలో బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను పెంచే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

క్యాబినెట్ నిర్ణయానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఇతర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలు కుల సంఘాలు మేధావులతో కలిసి జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిర్వహించిన పోరాట ఫలితమే 42 శాతం రిజర్వేషన్ల ప్రకటన అని, ఇది ముమ్మాటికి బీసీల విజయంగా భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లును రాష్ర్ట గవర్నర్ ద్వారా రాష్ర్టపతికి పంపించి మూడు నెలలు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యామ్నాయంగా రాష్ర్ట ప్రభుత్వం సర్వ అధికారాలు ఉపయోగించడం ద్వారా గత ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి, ఆర్డినెన్స్‌ను గవర్నర్ ద్వారా ఆమోదించుకొని బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. రాజకీయ పార్టీలు బీసీల రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ రిజర్వేషన్లను అటకెక్కించాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని కొంతమంది పబ్బం గడుపుకోవాలని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అగ్రకుల సమాజం సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని, లేనిపక్షంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయించాలని రోడ్లపైకి రావాల్సి వస్తుందని హితవు పలికారు. రెండు మూడు రోజుల్లోనే హైదరాబాదులో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, న్యాయవాదులతో ‘మేధో మదన’ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.