10-07-2025 12:56:44 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలుగా సహకరిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖమంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా చూడాలని కేంద్రమంత్రి రాష్ట్రానికి సూచించారు.
రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని, రాష్ట్రానికి సరిపడా యూరియా, ఎరువులు సరఫరా చేయాలని కేంద్రమంత్రి నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూలై, ఆగస్టు నెలల్లో యూరియాను నిరాటకంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి బుధవారం ప్రకటన విడుదల చేశారు.
కేంద్రం పంపిణీ చేస్తున్న యూరియాను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా పంపిణీ అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు. తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతుందని కేంద్ర మంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు.
2023-24 యాసంగితో పోలిస్తే 2024-25 యాసంగిలో యూరియా అమ్మకాలు 21 శాతం అధికమయ్యాయని తెలిపారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు.