14-03-2025 01:05:58 AM
అన్యాక్రాంతమైన 1348.34 గజాల స్థలం
రూ.10 కోట్ల విలువైన స్థలానికి ఎసరు
సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మించి, లీజ్ డీడ్ చేసుకున్న వైనం
ఫిర్యాదులపై పట్టించుకోని ఆదిభట్ల మున్సిపల్ అధికారులు
స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ తక్షణమే దృష్టిసారించాలంటున్న స్థానికులు
ఇబ్రహీంపట్నం, మార్చి 13 (విజయ క్రాంతి):నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కొంగరకలాన్ అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోంది. ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తో పాటు కేన్స్, ఫాక్స్ కాన్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీల రాకతో ఈ ప్రాంతం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక్కడ గజం ధర రూ.50 నుంచి 80 వేల వరకు పలుకుతోంది. దీంతో అక్రమార్కులు ఎక్కడ అవకాశం దొరికినా భూ ములను చెరబట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అందుకే అక్రమార్కుల కన్ను ఆది భట్ల మున్సిపాలిటీ పై పడి, పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అడుగడుగున అక్రమాలు పుట్టుకొస్తున్నాయి. వివరాల్లోకి వెలితే... రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్ లోని శ్లోక కన్వెన్షన్ నిర్వాహకులు గిఫ్ట్ డీడ్ స్థలాన్ని ఆక్రమించి సీసీ రోడ్డుతో పాటు అక్రమంగా ప్రహారి గోడను నిర్మించారు.
గతంలో కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలో తకలపల్లి సుజాత దేవి వద్ద పిండి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 1995 లో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, 2012లో 24200 గజాలుగా నాలా కన్వర్షన్ చేసుకున్నారు. అనంతరం తాను కొనుగోలు చేసిన 388, 389, 390 సర్వే నెంబర్లు గల భూమిలో 668.31 గజాలు, అదేవిధంగా 680.03 గజాలు ఈ రెండు కలిపి 1348.34 గజాల స్థలాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల చేత ధృవీ కరించిన డాక్యుమెంట్ ను 2021 డిసెంబర్ 24వ తేదిన స్థానిక మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ చేసి అప్పగించారు.
అయితే ఈ కన్వెన్షన్ హాల్ నిర్మాణం పూర్తి అయ్యి, ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా గిఫ్ట్ డీడ్ స్థలాన్ని ఆక్రమించి సుమారు 500 మీటర్ల పొడవు, 6 ఫీట్ల ఎత్తులో రోడ్డును,అక్రమంగా ప్రహరీ గోడను నిర్మించారు. ఇవి కనిపించకుండా దట్టమైన చెట్లను నాటీ, ఎవరికంట పడకుండా దృష్టి మళ్లించే విధంగా చేశారు. ప్రస్తుతం ఈ అంశమే విమర్శకు తెర లేపింది.
2021 నవంబర్ 29న 726.93 గజాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ కు మార్డిగేజ్ చేసిన శ్రీనివాస్ రెడ్డి, 2023 జూలై 1వ తేదిన హెచ్‌ఎండీఏ నుంచి రిలీజ్ చేశారు. అనంతరం 2023 సెప్టెంబర్ 1వ తేదిన శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ డీడ్ చేసిన స్థలాన్ని కూడా కలిపి తన భార్య పిండి అర్చన పేరున లీజ్ డీడ్ చేశారు. అయితే గిఫ్ట్ డీడ్ చేసిన 1348.34 స్థలం విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుంది. కానీ దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీకి సంబంధించిన అత్యంత విలువైన గిఫ్ట్ డీడ్ స్థలాన్ని ప్రస్తుత మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
నిబంధనందనలన్ని తూచ్..
మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వివిధ అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనీ, ఇదివరకు ఆదిభట్ల మున్సిపాలిటీలో కూల్చిన కొన్ని అక్రమ నిర్మాణాలు కూడా ప్రస్తుతం కండ్ల ముందు కొనసాగుతున్నా చర్యలు తీసుకోవడంలో రాజకీయ నాయకుల వత్తిళ్ల కారణంతో అధికారులు వెనుకడుగు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పేరుకే తప్పా, ఆచరించడంలో ఆమడదూరంలో ఉంటున్నారు.
లింక్ డాక్యుమెంట్ ఆధారంగానే: సోనీ, ఇన్చార్జి సబ్ రిజస్ట్రార్, ఇబ్రహీంపట్నం
గిఫ్ట్ డీడ్ చేసిన స్థలాన్ని వదిలిపెట్టి, మిగిలిన స్థలాన్ని మాత్రమే లీజ్ డీడ్ చేసు కోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ లీజ్ డీడ్ చేసే సమయంలో.. హెచ్‌ఎండీఏ కు గిఫ్ట్ డీడ్ చేశారన్న విషయం డాక్యుమెంట్లో ఎక్కడ కూడ ప్రస్తావించలేదు. వారు చూపిన లింక్ డాక్యుమెంట్ ఆధారంగానే మొత్తం 24200 గజాల స్థలాన్ని లీజ్ డీడ్ చేయడం జరిగింది. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో సమస్య బయటకి రాలేదు.