14-03-2025 01:04:17 AM
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ, కుట్ర పూరితంగానే జగదీశ్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేయించిందన్నారు.
అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. జగదీశ్‌రెడ్డి అనని మాటలను అన్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరించందని ఆరోపించారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు వసూలు చేస్తున్నదని ఆరోపించిన కేటీఆర్..
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారనే భయంతో, నియంతృత్వ పోకడతో తమ గొంతునొక్కే ప్రయ త్నం చేస్తున్నదని మండిపడ్డారు. జగదీశ్‌రెడ్డి సస్పె న్షన్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌మార్గ్‌లోని అంబేద్కర్ విగ్ర హం ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కేటీఆర్ నిరసన తెలిపారు.
జగదీశ్‌రెడ్డి ఎక్కడా స్పీకర్‌ను అగౌరపరిచేలా మాట్లాడలేదని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. కనీసం వివరణ కూడా అడగకుండా, ఏం తప్పు చేశారో చెప్పకుండానే ప్రభుత్వం నియంతృత్వ పోకడతో జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసిందని ఆరోపించారు.
చరిత్రలో ఇదో చీకటి రోజు..
కాంగ్రెస్ పార్టీ పట్టపగలే ప్రజాస్వామ్యం గొంతు కోసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదో చీకటి రోజని పేర్కొన్నారు. అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు చేయిస్తున్న ప్రభుత్వం.. అసెంబ్లీలో సస్పెన్షన్ పేరుతో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నదని దుయ్యబట్టారు.
అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. రాష్ర్టపతి ద్రౌపది ముర్మును కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
కమీషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే..
కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఉద్దేశపూర్వకంగా రేవంత్‌రెడ్డి సర్కారు తనను సస్పెండ్ చేసిందని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మీడియా పాయింట్‌వద్ద తమకు మాట్లాడే అవకాశం రాకుండా 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడించి, అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు.
సభలో తాను మాట్లాడటం మొదలు పెట్టగానే కాంగ్రెస్ సభ్యులు అరవడం మొదలు పెట్టారని వెల్లడించారు. వారిని అదుపు చేయమని స్పీకర్‌కు తాను పదేపదే విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. ఆ సందర్భంలోనే ఈ సభ కాంగ్రెస్ పార్టీది కాదని తాను పేర్కొన్నానన్నారు.
సభలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేయడంతోపాటు అధికార పక్ష సభ్యులను కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని స్పీకర్‌కు గుర్తు చేసినట్టు చెప్పారు. సీఎం మెప్పు పొందేందుకే తనను సస్పెండ్ చేసినట్టు జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తన సస్పెన్షన్‌తో ప్రజల గొంతు నొక్కలేరని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వాటిని ప్రజల మధ్య ఎండగడతామన్నారు.