16-12-2024 01:39:38 AM
సిద్దిపేట, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ఐదు దశాబ్దాల ఉద్యమంలో గద్దరన్న చెరగని ముద్ర వేసుకున్నారని, విప్లవ ఉద్యమంతో పాటు తెలంగాణ, దళిత ఉద్యమాల్లో గద్దర్ న్యాయం కోసం పని చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న సాహిత్యం కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.
గద్దరన్న విగ్రహాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం తన బాధ్యత అని ప్రకటించారు. గద్దర్ జీవితచరిత్రపై నిర్మించే డాక్యూమెంటరీకి తన వంతు సహకారమందిస్తానని వెల్లడించారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించే లక్ష్యంతో గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ కృషి చేయాలని సూచించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దరన్నను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. వంద ఉపాన్యాసాల సారం గద్దరన్న రాసిన, పాడిన ఒక్క పాటకు సమానమన్నారు.
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అనే పాట ఉన్నన్నీ రోజులు గద్దరన్న సజీవంగా ఉన్నట్లేనని చెప్పారు. గద్దరన్న రాసి పాడిన అనేక పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసాయన్నారు. తుప్రాన్‌లో నీళ్లు లేవని, హల్దీ వాగులో నుంచి చెరువుకు లిఫ్ట్ నిర్మించాలని గద్దర్ కోరితే 8 నెలల్లో లిప్టులు నిర్మించి గద్దర్‌తో ప్రారంభం చేయించామని వెల్లడించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని గద్దర్ ఇచ్చిన వినతి పత్రానికి స్పందించిన అప్పటి సీఎం కేసీఆర్ వెంటానే అమలు చేశారని గుర్తు చేశారు. గద్దరన్న కుమారుడు సూర్యకిరణ్ పదవులకు ఆశపడకుండా గద్దర్ ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు.
ప్రజల ఆలోచనలను ప్రభుత్వం స్వీకరించదో అక్కడ అణచివేత ఉన్నట్లేనని, అలాంటప్పుడు ప్రభుత్వాలు ప్రకటించే అవార్డులు స్వీకరించేది లేదని గద్దరన్న చెప్పేవారని హరీశ్‌రావు తెలిపారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి నందిని సిధారెడ్డికి అవార్డు ప్రకటిస్తే ఆయన దాన్ని తిరస్కరించి గద్దరన్న మాటను నిరూపించారని వెల్లడించారు.
ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సామాజిక రుగ్మతలపై పోరాడిన గద్దరన్న తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నది ప్రత్యేక పాత్రగా వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై తాను మాట్లాడిన మాటాలను తప్పుబడుతూ కొందరు అనవసరపు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మానుకోడూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు మాట్లాడుతూ గద్దరన్న ఆశయ సాధనకు ఫౌండేషన్ కృషి చేయాలని కోరారు.
పుస్తకాల ఆవిష్కరణ
ప్రజా యుద్ధనౌక గద్దరన్న సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయ న రచించిన పుస్తకాలను ఆవిష్కరిస్తున్నట్లు గద్దర్ కుమారుడు, గద్దరన్న ఫౌండేషన్ వ్యవస్థపక అధ్యక్షుడు జీవీ సూర్యకిరణ్ వెల్లడించారు. తాను గద్దర్ కడుపున పుట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గద్దర్ రచించిన పాటల జీవకణం, తరగని గని, లష్కర్, అండర్ గ్రౌండ్ అనే పుస్తకాలను వక్తల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి పాపయ్య అధ్యక్షత వహించ గా, మంజీర రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు రంగాచారి, ప్రధాన కార్యదర్శి సిద్దెంకి యాదగిరి పాల్గొన్నారు.