05-07-2025 02:09:04 AM
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ‘పార్టీలో అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలి.. పాత, కొత్త అనే తేడా ఉండొద్దు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులు కడితే భయపడుతామని అనుకుంటున్నారా? ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. వారిని నేను గానీ, రాహుల్‌గాంధీ అసలు పట్టించుకోం. వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుంది.
పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు, పార్టీ నియమ నిబం దనలకు కట్టుబడి ఒకేతాటిపై నిలవాలి’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సున్నితంగా హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పీఏసీ, పార్టీ సలహాదారు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొ న్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలపై సమాలోచనలు చేశా రు. పటాన్‌చెరు అగ్నిప్రమాద ఘటనపై పీఏ సీ సమావేశంలో సంతాపం తెలిపి మౌనం పాటించారు. పార్టీలో పని చేసిన వారికి, అర్హత ఉన్న వాళ్లకే పదవులు ఇవ్వాలని సూచించారు.
ఈ నెల 30లోపు పో స్టులన్నీ భర్తీ చేయాలని, పదవులు భర్తీ కాకుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌దే బాధ్యత అని ఖర్గే తెలిపారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి కలుగజేసుకొని జిల్లా, నియోజవర్గ స్థాయిలోని పదవుల భర్తీ బాధ్యత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు బాధ్యత తీసుకొని ఆశావహుల జాబితా సిద్ధం చేసి పీ సీసీకి పంపాలని సూచించినట్టు సీఎం వివరించారు.
అత్యుత్సాహం వద్దు: కేసీ వేణుగోపాల్
కాంగ్రెస్‌లో కొంతమంది నేతలు అత్యుత్సాహంగా మాట్లాడుతూ వివాదస్పదంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చురకులు అంటిం చారు. ‘మన ప్రతీ మూమెంట్‌ను ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఆచితూచీ వ్యవహారించాలి. మీ వ్యవహార శైలితో పార్టీకి నష్టం తీసుకొస్తే ఊరుకోం. పార్టీ ఉంటేనే మీరుంటారు. సొంత ఎజెండాతో పనిచేసే వారిపై వేటు తప్పదు’ అని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత తర్వగా భర్తీ చేయాలని కేసీ వేణు గోపాల్ సూచించారు.
సమన్వయంల లేదు: వీహెచ్
పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు.పార్టీలోకి కొత్తగా వచ్చినవారు పాతవారితో కలిసి వెళ్తే పార్టీ బలం మరింత పెరుగుతుందన్నారు.