25-07-2025 12:30:52 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు కందిపప్పు సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని పప్పు మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు గురువారం మంత్రికి లేఖ రాశారు. విద్యార్థులు ఆరోగ్యం ఉండేందుకు కంది పప్పు లాంటి పోషక విలువలు ఉన్న దినుసులు ఎంతో అవసరమని తెలిపారు.
ఆరోగ్యంతోపాటు విద్యలోనూ మెరుగుదల చూపించేందుకు పప్పు కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలకు కంది పప్పు సరఫరా చేసేందుకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. దీంతో స్థానికంగా సప్లయ్ చైన్ మెరుగుపడటంతోపాటు వ్యవసాయ పరంగా కంది పప్పు ఉత్పత్తికి డిమాండ్ కూడా పెరుగుతుందని వివరించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా లోకల్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని చిన్న, మధ్య తరహా సంస్థల్లో వృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని తెలిపారు. స్థానిక సేకరణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నాణ్యమైన కంది పప్పు స్థిరమైన సరఫరాను నిర్ధారిస్తుందని వివరించారు.