calender_icon.png 8 July, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదుకుంటాం.. అండగా ఉంటాం

03-07-2025 02:00:33 AM

  1. సిగాచి బాధిత కుటుంబీకులకు కాంగ్రెస్ భరోసా
  2. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి దామోదర, మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
  3. నేతలను చుట్టుముట్టిన కార్మికుల బంధువులు
  4. తమ వారి జాడ తెలుపాలని డిమాండ్

పటాన్‌చెరు, జూలై 2: సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో మరణించిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తో పాటు, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భరోసా ఇచ్చారు. బుధవా రం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహే శ్‌కుమార్‌గౌడ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

పరిశ్రమ వద్దకు వచ్చిన వారిని కార్మి కుల కుటుంబీకులు, బంధువులు చుట్టు ము ట్టారు. వారి గోడును వెల్లబోసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తమ వారి జాడ ఇం కా లభించలేదని రోదిస్తూ తెలిపారు. ఆచుకీ తెలుసుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. పరి శ్రమలో ఇంకా సహాయ చర్యలు జరగుతున్నాయని చెప్పారు.

చనిపోయిన కార్మికుల్లో 18మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. కొన్ని మృత దేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. అనంతరం దవాఖానలో చి కిత్స పొందుతున్న కార్మికులను పరిశీలించారు. 

ఘటన బాధకరం: మీనాక్షి నటరాజన్ 

పరిశ్రమలో జరిగిన పేలుడులో కార్మికులు మృతి చెందడం చాలా బాధాకరమని మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పరిహారం అందజేస్తుందని భరోసా ఇచ్చారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. పరిశ్రమలో ఇంకా సహాయ చర్యలు కొనసా గుతున్నాయని, పేలుడు ఘటనకు అసలు కారణం ఏంటనేది నిపుణులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. 

పరిహారం అందజేస్తాం: మహేశ్‌కుమార్‌గౌడ్

మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిచిన పరిహారం అందజేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న కార్మికులకు కూడా పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.  ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌తో పాటు రాష్ట్ర ఏజెన్సీల సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.

ఈ ఘటన చాలా బాధాకరమని, చనిపోయిన వారంతా ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. పరిశ్రమ ద్వారా మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రమాదం బాధాకరం: పరిశ్రమ వైస్ చైర్మన్ చిదంబర్ నాథన్

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని పరిశ్రమ వైస్ చైర్మన్ చిదంబర్ నాథన్ పేర్కొన్నారు. గత 35 సంవత్సరాలుగా పరిశ్రమను నడుపుతున్నామని, ఇంతటి ప్రమాదం ఎప్పడు జరుగలేదని తెలిపారు. పది సంవత్సరాల క్రితం కంపెనీని ఎలాంగో అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని, కంపెనీ బాధ్యతలు ఆయనే చూస్తున్నారని చెప్పారు. ప్రమాదంలో ఎలాంగో కూడా మృతి చెందారని చెప్పారు.