calender_icon.png 8 July, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు గుర్తింపు కార్డు !

03-07-2025 01:58:51 AM

-అన్నదాతకూ ఐడీ నంబర్..

-సాగు డిజిటలైజేష్ప కేంద్రం దృష్టి

-సంక్షేమ లబ్ధి నేరుగా రైతుకే చేరేలా చర్యలు

-జిల్లాలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మెదక్, జూలై 2(విజయక్రాంతి): కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ పథకం నేరుగా రైతులకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మనిషికి ఆధార్ మాదిరిగానే ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్టసంఖ్య ఉండాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం. అయితే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుంటే ఎలాంటి చట్టబద్ద హక్కు కల్పించినట్లు కాదని, కేవలం రైతు గుర్తింపు కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లుగా ప్రభుత్వం పేర్కొంటుంది. ఫార్మర్ ఐడీకి, రాష్ట్రం అమలు చేస్తున్న రైతు పథకాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 

రిజిస్ట్రేషన్ ఇలా..

జిల్లాలో రైతు వివరాల నమోదు ప్రక్రియను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు చేపడుతున్నారు. మండల పరిధిలోని ప్రతీ గ్రామంలో రోజువారీగా రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 2025 జనవరి వరకు రెవెన్యూ శాఖ వద్ద అందుబాటులో ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని వారికి సంబర్లు కేటాయిస్తున్నారు. రైతుల నుంచి ఆధార్ కార్డు, పట్టదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేస్తూ ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ గత నెల 4న ప్రారంభం కాగా ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు సగం మంది కూడా నమోదు చేసుకోలేదు.అయితే ఈప్రక్రియ నిరంతరాయంగా కొన సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్ర పథకాలకు వర్తింపు...

రైతులకు కేటాయించే ఐడీ నంబర్ ఇక నుంచి కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ పథకానికి తప్పనిసరి కానుంది. రానున్న రోజుల్లో కేంద్ర పథకాలకు ఈ నంబర్ను అనుసంధానం చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సహజ వ్యవసాయం. ఫసల్ బీమా యోజన వంటి తదితర పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ నంబర్ ప్రామాణికంగా తీసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో సంబంధం లేకుండా కేవలం కేంద్ర పథకాల కోసమే ఈ నంబర్ కేటాయిస్తోంది. ఈనెలాఖరులో విడుదల చేయనున్న పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే రైతులకు ఈ నంబర్ తప్పనిసరి అని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.

కొనసాగుతున్న నమోదు ప్రక్రియ

ఫార్మర్ ఐడీ నంబర్ను కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా తీసుకునే ఆవకాశం ఉంది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మా న్ పథకానికి ఈ నంబర్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. జిల్లాలో 2.89 లక్షల మంది రైతులకు గాను, 71,656 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు వివరాలు నమోదు చేసుకోని వారు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి ఫార్మర్ ఐడీ పొందవచ్చు.

-- వినయ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి