25-12-2025 02:53:14 AM
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 24(విజయక్రాంతి): గ్రామపంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చిన్నరావిరాల గ్రామ సర్పంచ్ బాలకిషన్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని చిన్నరావిరాల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ కార్తీక్‌రెడ్డి, ఎంపీవో మధుసూదన చారిలు హాజరయ్యారు. ముందుగా సర్పంచ్ బాలకిషన్ గౌడ్ ప్రమాణస్వీకారం చేయగా..
ఉపసర్పంచ్ సద్దుపల్లి శ్రీరిష శివారెడ్డి, వార్డు మెంబర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలకిషన్ గౌడ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి.. గ్రామానికి మరింత అభివృద్ధి చేసి.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముందుగా గ్రామంలో ఉచితంగా నీటి అందిస్తానని అన్నారు.
అదే విధంగా దేవాలయను కూడా నిర్మిస్తానని అన్నారు. సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ పేర్కొన్నారు. తనకు ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజలకు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు కిష్టయ్య, వెంకటేశ్, కందాడి లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవనీత తదితరులున్నారు.