26-05-2025 01:13:50 AM
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
జగిత్యాల, మే 25 (విజయక్రాంతి): అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం బీర్పూర్ మండలం నర్సింహులపల్లె ఐకెపి, పాక్స్ వరి కొనుగోలు కేంద్రాలను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మార్కె ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డిలతో కలిసి విద్యాసాగర్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు వరి ధాన్యం తడిచి ముద్దైతే పట్టించుకునే నాధుడే లేడన్నారు. తాము కల్లాల్లోకి రాజకీయం చేయడానికి రాలేదని, రైతుల కష్టం, బాధ చూసి వచ్చామన్నారు. ఒక పక్క రైతులు అరిగోస పడుతుంటే, వారిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డికి అందాల పోటీలు అవసరమా? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటు, నీళ్లు ఇచ్చి, చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లన్నీ సముద్రంలోకి వదిలి కేసిఆర్’ను బద్నాం చేయాలని చూస్తున్నారని విద్యాసాగర్ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన వెంట సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు, మాజీ పాక్స్ చైర్మన్ మెరుగు రాజేశం, మాజీ సర్పంచ్ భూమన్న, పాక్స్ డైరెక్టర్ సతీష్, మాజీ వార్డు మెంబర్ సుధాకర్, నాయకులు శ్రీనివాస్, సుదర్శన్, లక్ష్మీనారాయణ, సుధ, రమేష్, రాజేందర్,తదితరులున్నారు