calender_icon.png 20 December, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ సమస్యల మాటేమిటి?

10-12-2025 12:00:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

తెలంగాణ రాష్ర్టంలో ఉన్నత విద్యా వ్యవస్థలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక కలికితురాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేయడం, చదువుకోవడం ప్రతి ఉద్యో గి, ప్రతి విద్యార్థి తనకు దక్కిన గౌరవంగానే భావిస్తారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటులో విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా పని చేశాయి. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమంలో రాష్ర్ట సాధనకు కదం తొక్కిన ఆనవాళ్లు ఇంకా కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా కదలాడుతూనే ఉన్నాయి.

నాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ర్ట తొలి పాలకుడు కేసీఆర్ తన పదవీకాలంలో ఉస్మాని యా విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. తన పాలనా కాలంలో విశ్వవిద్యాలయాలలో ప్రమాణాలు పెరగకపోవడం, విశ్వవిద్యాలయాల అటానమీ అటకెక్కటం, నియామకాలు చేపట్టకపోవడం, బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కారం కాకపోవ టం తో విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులు, ఉద్యోగులు కేసీఆర్‌పై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

రాష్ర్టంలో అధికార మార్పిడి జరగడం.. రెండు దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావటంతో విశ్వవిద్యాలయా ల్లో పరిస్థితులు మారతాయని ఆశించారు. ఆగస్టు నెలలో హాస్టల్స్ ప్రారంభోత్సవానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం, ఇచ్చిన హామీలు గతానికి భిన్నంగానే కనిపించాయి.ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయాల్లాగా ఉస్మానియా విశ్వవిద్యాలయా న్ని అభివృద్ధి చేస్తానని, విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంత ఇచ్చినా తక్కువే.

ఎంతైనా ఖర్చు చేయ టానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇస్తూ.. ‘ఇది ప్రజా ప్రభుత్వం డిసెంబర్‌లో మళ్లీ విశ్వవిద్యాలయానికి వస్తాను. మీ సమస్యలు వింటాను. అక్కడికక్కడే ఆ సమస్యలను పరిష్కరిస్తాను. క్యాం పస్‌లో ఒక్క పోలీస్‌ని పెట్టవద్దు. నిరసన తెలిపే వారిని తెలపనీయండి. అది వారి హక్కు’ అని ముఖ్యమంత్రి మాటలు కొంత నమ్మకాన్ని కలిగించాయి. ఇచ్చిన మాటకు నిలబడిన రేవంత్ ఉస్మా నియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నామని ప్రకటన చేశారు.

డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బా ధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మరొకసారి ఓయూకు రావాల్సిన సీఎం రేవంత్ ‘తెలంగా ణ రైజింగ్ గ్లోబల్  సమ్మిట్’ వల్ల పర్యటనను నేటికి వా యిదా వేసుకున్నారు. కానీ విశ్వవిద్యాలయ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీ క్ష సందర్భంగా హాస్టల్ భవనాలు, అకాడమిక్ బ్లాక్ లు, ఆడిటోరియం, రహదారుల నిర్మాణం, సైక్లింగ్ ట్రాక్ లు, వాకింగ్ పాత్ లు, పోరాట చి హ్నాల గురించి సమీక్షించి సూచనలు చేసిన ముఖ్యమంత్రి దశాబ్దాలుగా చదువుకు తగిన గుర్తింపు, అవకాశాలు, పనికి తగిన వేతనాలు లేక పార్ట్ టైం, కాంట్రాక్ట్ అధ్యాపకులుగా మిగిలిపోయిన వారి సమస్యలపై సమీక్ష చేయకపోవడం, వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ఆయా వర్గాలను అసంతృప్తికి గురిచేసింది.

ముఖ్యమంత్రి సమీక్షలో పరిమాణాత్మకమైన అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టినప్పటి కీ, గుణాత్మకమైన సమస్యలపై చర్చించినట్లుగా కనపడలేదు. విశ్వవిద్యాలయంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన జరగాలి. భవనాలు నిర్మించినంత మాత్రాన అంతా మారిపోయినట్లు కాదు, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పెంచడానికి తమ చెమట చుక్కలు ధారపోస్తున్న వారి బతుకు లు కూడా మార్చాలి. 70 శాతం బోధనా భారా న్ని మోస్తున్న పార్ట్ టైం, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారమైతేనే కదా వారి సామర్థ్యం పెరిగి నాణ్యమైన బోధ న విద్యార్థులకు అందేది.

ముఖ్యమంత్రి సమీక్షలో అధ్యాపకుల, ఉద్యోగుల సమస్యల ప్రస్తావన రాకపోవటం వెలితిగానే కనిపించింది. రాష్ర్ట ప్రభుత్వ ఆధీనంలోని 12 విశ్వవి ద్యాలయాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్ల రూపా యల అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నప్పుడు రాష్ట్రంలోని కాకతీయ విశ్వవిద్యాలయం సహా మిగతా విశ్వవిద్యాలయాలపై దృష్టి పెట్టాల్సిన అవసముంది.

12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తు న్న 713 మంది పార్ట్ టైం అధ్యాపకులు, 1400 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు దశాబ్దాలుగా తమ కు జరుగుతున్న అన్యాయానికి ముఖ్యమంత్రి  పరిష్కారం చూపెడతారని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. బంగారు తెలంగాణ కంటే బతుకు దెరువు తెలంగాణ కావాలని చెప్పిన వారే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేయకపోతే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది.