02-09-2025 12:14:29 AM
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
గద్వాల్ టౌన్ సెప్టెంబర్ 1 : 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ నుండి ప్రజల మద్దతు తో గెలిచి ప్రస్తుతం ఏ పార్టీ లో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే తో గద్వాల నియోజకవర్గం ఏం అభివృద్ధి జరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సోమవారం జిల్లా కేంద్రం లోని బిజెపి పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు స్థానిక నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి గద్వాల జిల్లా అభివృద్ధి కి తమ వంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం ను అందచేశారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మీడియా తో ఆమె మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పకుండా ప్రజలను మభ్య పెడుతూ అభివృద్ధి కోసం తపన పడుతున్నాని చెప్పడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమి లేదన్నారు. అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీ లోకి మారిన ఎమ్మెల్యే నేటికీ గద్వాల నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో గుండు సున్న అంటూ కితబు ఇచ్చారు. పట్టణంలో గ్రామీణ గుంతల మయమైన రోడ్లపై నేటికీ తట్టడు మట్టి వేయలేదన్నారు.
ఇరిగేషన్ విషయానికి వస్తే గతంలో ఆర్డీఎస్ ఆధునికరణ కోసం ఎన్నో పోరాటాలు చేస్తే బిఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోక పోగా తుమ్మిళ్ల లిఫ్ట్ ను ప్రారంభం చేసిన నేటికీ పనులు పూర్తికాక అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నెట్టంపాడు పథకం క్రింద ర్యాలంపాడు రిజర్వాయర్ కు 2 టిఎంసిల ప్రాజెక్టు ను 4 టి ఎంసిలకు పెంచి ఈ ప్రాంతానికి అభివృద్ధి కీ కృషి చేస్తూ ఆ నాడే ర్యాలంపాడు లికేజిలపై రాష్ట్ర అధికారుల ద్రుష్టికీ తీసుకువెళ్ళడం జరిగిందని నెట్టంపాడు కాల్వలో జమ్ముతో నిండిపోయి మట్టికుప్పలుగా పేరుకోపోయిందన్నారు.
ఈ ప్రాంతానికి ఇరిగేషన్ అధికారి వచ్చిన రివ్యూలకే సరిపోయిందే తప్ప ఒక్క రూపాయి కేటాయించి అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, గద్వాల జిల్లా ఎన్నికల ఇఛార్జ్ వీరేంద్ర గౌడ్, బిజెపి యువ నాయకురాలు స్నిగ్దా రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామాంజనేయలు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరాముడు,పార్టీ జిల్లా ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.