30-09-2025 12:00:00 AM
డాక్టర్ సురేష్ బాబు :
ఆరు సంవత్సరాలుగా లద్దాఖ్ ప్ర జలు ఒక విషయమై ఎదురుచూస్తూనే ఉన్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపడుతూనే ఉన్నారు. ఆరేళ్లగా నిరసన సాగుతున్న వేళ.. లద్దాఖ్‌ను తామే పాలించుకోవాలనేది వారి ప్రధాన డిమాండ్. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. దీంతో గత బుధవారం లద్దాఖ్ ప్రజలు ముఖ్యంగా యువత సహనం చెల్లాచెదురైంది. లేహ్ వీధులు అగ్నికి ఆహుతయ్యాయి.
2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ అట్టుడు కుతోంది. ఇంటర్నెట్ బంద్, నేతల గృహ నిర్బంధాలతో కశ్మీర్ లోయలో పూర్తి భద్రతా వలయం. కానీ, సరిహద్దుకు ఇవతల ఉన్న లద్దాఖ్‌లో మాత్రం పండుగ వా తావరణం. జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి, ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడాలన్న వారి చిరకాల స్వప్నం నెరవేరిన రోజు అది. కట్ చేస్తే, ఆరేళ్ల తర్వాత ఇప్పుడు లద్దాఖ్ వీధులు నిరసనలతో రగిలిపోతున్నాయి.
పోలీసుల కాల్పులు, నలు గురి మృతి, కర్ఫ్యూతో ఉద్రిక్తంగా మారిం ది. మరి ఆనాటి సంబరం ఈనాటి ఆగ్రహంగా మారడానికి కారణం ఏమిటి? లద్దాఖ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా మారడం తమ డిమాండ్ల సాధనలో మొదటి అడుగేనని లద్దాఖ్ ప్రజలు భావించారు. 2019లో జ మ్మూ కశ్మీర్ రాష్ర్ట హోదా రద్దు చేసి లద్దాఖ్‌ను శాసనసభ లేకుండా యూనియన్ టెరిటరీగా మార్చినప్పటి నుంచి, స్థానికు లు పాలనలో పూర్తిగా పక్కకు నెట్టబడ్డారు.
ఉద్యోగాలు లేవు, హక్కులు లేవు, హామీలు నిలబడలేదు. ఉపాధి లేదు. ఇప్పుడు ఈ ఆగ్రహమే ‘జనరేషన్ జెడ్’ తిరుగుబాటుకు నాందిలా మారిపోయింది. గడిచిన ఆరేళ్లలో తమ డిమాండ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో లద్దాఖ్ ప్రజల సహనం నశించింది. పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో మొదలైన శాంతియుత ఉద్యమం, కాలక్రమేణా తీవ్రరూపం దాల్చింది. లేహ్‌లోని బౌద్ధులు (లేహ్ అపెక్స్ బాడీ), కార్గిల్‌లోని షియా ముస్లింలు (కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్) కలిసికట్టుగా ఉద్యమించడం ఈ పోరాటానికి కొత్త బలాన్నిచ్చింది.
నాలుగు డిమాండ్లు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన చర్చలు విఫలం కావడం నిరసనకారు లను మరింత నిరాశకు గురిచేసింది. నిరాహార దీక్ష చేస్తున్న కొందరు కార్యకర్తలను ఆసుపత్రికి తరలించడం, అక్టోబర్‌లో చ ర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించ డం వంటివి ఆజ్యం పోశాయి. దీంతో జనరేషన్ జెడ్ యువతరం రంగంలోకి దిగిం ది. వారు మరింత తీవ్రమైన నిరసనలకు పిలుపునివ్వడంతో, ఉద్యమం హింసాత్మకంగా మారింది.
బీజేపీ కార్యాలయం, పోలీసు వాహనాలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది.‘మా యువతను తుపాకీ బుల్లెట్లతో ఏం చేయలేరు. వారు తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడేందుకు మాత్రమే రోడ్లపైకి వచ్చారు’ అని లద్దాఖ్ అపెక్స్ బాడీకి చెందిన జిగ్మత్ పల్‌జోర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర హోదా, రా జ్యాంగ రక్షణ, ఉద్యోగ, భూమి హక్కులు, పార్లమెంటులో ప్రాతినిధ్యం..
ఇవే తమ నాలుగు ప్రధాన డిమాండ్లు అని లద్దాఖ్ ప్రజలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అయితే లద్దాక్ విషయంలో లద్దాఖ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనికి ప్రధాన కారణం, లద్దాఖ్ భౌగోళికంగా చైనాతో సరిహద్దును పంచుకోవడం. ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. రాష్ర్ట హోదా ఇస్తే, రక్షణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గు తుంది.
చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న తరుణంలో, సైనిక బలగాల కదలికలకు, రహదారుల నిర్మాణానికి ఎ లాంటి ఆటంకాలు ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే లేహ్, కార్గిల్‌లలో ‘అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌ న్సిల్స్’ ఉన్నాయని, వాటి ద్వారా స్థానిక ప్రజలకు రక్షణ లభిస్తోందని కేంద్రం వాదిస్తోంది. అయితే, ఈ కౌన్సిల్స్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కింద పరిమిత అధికారాలే ఉన్నాయని, అవి నామమాత్రమేనని స్థానిక నాయకులు అంటున్నారు.
అస్త్రాల మళ్లింపు
అయితే ప్రజల డిమాండ్లపై చర్చించడానికి బదులుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అస్త్రాలను ప్రముఖ పర్యావరణవేత్త హక్కుల ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ వైపు మళ్లించింది. ఆయన ప్రసంగా లు ‘అరబ్ స్ప్రింగ్ శైలిలో నిరసనలు’ ప్రేరేపించాయని ఆరోపించింది. ఇదే సమ యంలో వాంగ్‌చుక్ స్థాపించిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లద్దాఖ్ (ఎస్‌ఈసీఎమ్‌వోఎల్) సంస్థ కు చెందిన విదేశీ నిధుల లైసెన్స్‌ను రద్దు చేసింది.
లద్దాఖ్‌లో ఆర్థిక లోపాలు, అవకతవకలతో పాటు జాతీయ ప్రయోజనాల కు విరుద్ధమైన నిధుల బదిలీ జరిగిందని ఆరోపించింది. 2019 నుంచి లద్దాఖ్ ప్ర జలు నిరంతరాయంగా కోరుతున్న నా లుగు ప్రధాన డిమాండ్లను తీర్చడంలో కేంద్రం విఫలమైంది. లద్దాఖ్ జనాభాలో 90 శాతం కంటే ఎక్కువ మంది షెడ్యూల్ ట్రైబ్స్‌లోకి వస్తారు. అయినా వారికి సరైన రక్షణ లేదు.
లద్దాఖ్‌లో 97 శాతం అక్షరాస్యత ఉన్నా స్థానిక పట్టభద్రుల్లో నిరుద్యో గం.. జాతీయ సగటుతో పోలిస్తే రెండింత లు ఉంది. ఈ సందర్భంగా ‘యువతకు ఉ ద్యోగాలు ఇవ్వకుండా, ప్రజాస్వామ్య హ క్కులు లాక్కుంటే, సమాజంలో ఆగ్ర హం తప్ప మరేమీ మిగలదు’ అని వాంగ్‌చుక్ హెచ్చరించారు.
అనేక పోరాటాలు
1981, 1989లో జరిగిన పోరాటాల్లో లద్దాఖ్ ఇప్పటికే చాలా రక్తం చిందించింది. ఇప్పుడు తాజా ఉదంతంలో నలు గురు నిరసనకారుల మృతి చెందగా.. మ రెందరో క్షతగాత్రులయ్యారు. ‘కేంద్రం తప్పు విధానాలే లద్దాఖ్‌ను మంటల్లోకి నెట్టేశాయి’అని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ‘లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేర్చడం సమంజసం. ఇది భద్రతా పరంగా కూడా కీలకం’ అని కాం గ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ వ్యాఖ్యానించారు.
కానీ కేంద్రం మాత్రం ‘మాబ్ హింస’ అని వర్ణిస్తూ, పోలీసుల చర్యలను సమర్థించడం గమనార్హం. లద్దాఖ్ కేవలం రాష్ర్టహోదా డిమాండ్ మాత్రమే కాదు. ఇది చైనాతో భారత్ సరిహద్దు. 2020లో గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇక్కడ భారీగా సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ భ యంకర భూభాగం మరో అగ్నిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం లేహ్ నగరం కర్ఫ్యూలో ఉంది.
దీక్షలు విరమించినప్పటికీ కోపం మాత్రం మిగిలే ఉంది. ‘లద్దాఖ్ కు రాష్ర్టహోదా ఇవ్వండి.. ఆరో షెడ్యూల్ తక్షణమే అమలు చేయండి’ అన్న నినాదాలు లేహ్ వీధుల్లో ఇప్పటికీ మార్మోగు తూనే ఉన్నాయి. అయితే ఎందుకు కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించడంలో ఎందుకింత తాత్సారం చే స్తుందనేది ఇప్పుడు అందరి మదిలో మె దులుతున్న ప్రశ్న. ఇప్పటికైనా లడాఖ్ నిరసనలు ఢిల్లీకి వినిపిస్తాయా? లేక మరింత రక్తం చిందితేనే చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి.
కానీ కేంద్ర వైఖరి చూ స్తుంటే లద్దాఖ్‌కు పూర్తి రాష్ర్ట హోదా ఇవ్వడం సమీప భవిష్యత్తులో అసాధ్యంగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. చైనా అం శం దృష్ట్యా కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం లేదు. అయితే, ఒక మధ్యేమార్గం మాత్రం సాధ్యపడవచ్చు. అదేంటంటే ప్రభుత్వం రాష్ర్ట హోదాకు బదులుగా, హిల్ కౌన్సిల్స్ అధికారాలను గణనీయంగా పెంచి, ఉద్యో గ, భూమి హక్కులపై ప్రత్యేక హామీలు ఇవ్వవచ్చు. దీనికి బదులుగా, లద్దాఖ్ నాయకులు రాష్ర్ట హోదా డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టాల్సి ఉంటుంది. ఈ రాజీ కుదరని పక్షంలో శీతల ఎడారిలో నిరసనల సెగ మరింత పెరిగే ప్రమాదం మాత్రం పొంచి ఉంది.
వ్యాసకర్త సెల్: 9989988912