25-12-2025 02:47:31 AM
సిరికొండ, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామం నుంచి సిరికొండ వరకు విస్తరించిన బైపాస్ ప్రధాన రహదారి దుస్థితి ఆందోళనకరంగా ఉంది ఇటుక ప్రయాణించే వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు ఆరు నెలల క్రితం కేవలం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. సుమారు రూ.10 లక్షల వ్యయంతో చిప్స్ వేసి పనులు పూర్తి అయ్యాయి అనిపించారు, నేడు అదే రోడ్డు గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ రోడ్డుపై ప్రయాణం అంటే వాహనదారులకు భయానక అనుభవంగా మారింది. ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడిగాయాలపాలవుతుండగా, ఆటోలు, స్కూల్ వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మోడల్ స్కూల్కు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి రావడం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. వర్షం కురిస్తే రోడ్డంతా నీటితో నిండిపోతోంది. రోడ్డు ఉందో, గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడి రాత్రివేళ ప్రయాణం చేయా లంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వాలు మారుతున్నా, ఎన్నికలు వస్తున్నా ఈ రహదారి పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదన్న ఆవేదన గ్రామస్థుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు ఇచ్చే హామీలు మాటలకే పరి మితమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేకసార్లు అధికారులకు విన్న వించుకున్నా స్పందన లేకపోవడంతో తా ము మూగబోయామని ప్రజలు వాపోతున్నారు. చిన్న వాల్గోట్‌సిరికొండ బైపాస్ రోడ్డు ఎప్పుడైనా అభివృద్ధి చెందుతుందా..? లేక నిర్లక్ష్యానికి బలైపోతూనే ఉంటుందా..? అన్న ప్రశ్నలు గ్రామంలో వినిపిస్తున్నాయి.
ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, ప్రజాప్రతినిధులు అయినా ఈ రోడ్డు అభివృద్ధిపై దృష్టి సారిస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ సమస్యపై సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.