calender_icon.png 25 December, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రలోభాలకు లొంగి పార్టీ మారొద్దు

25-12-2025 02:46:07 AM

గంప గోవర్ధన్

కామారెడ్డి , డిసెంబర్ 24 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి.. పార్టీ మారవద్దని కామారెడ్డి  మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వెలమ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయా పైసా మంజూరు చేయలేదని విమర్శించారు.

వచ్చే రెండేళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం  ఒక్క రూపాయి నిధులు విడుదల చేయబోదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుందన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని సర్పంచులుగా గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదర్శంగా నిలవాలని సూచించారు. కేసీఆర్  చూపిన బాటలో నడిచి పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు.

మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు గడిచిన రెండు సంవత్సరాల నిధులను విడుదల చేసి గ్రామాల రూపురేఖలను మార్చడానికి పనిచేస్తామని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ ఏమైనా ఇబ్బందులు పెడితే జిల్లాలో లీగల్ టీంను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి ఖర్చు లేకుండా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రేంకుమార్, మాజీ జెడ్పీటీసీలు గోపి గౌడ్, రాంరెడ్డి, నల్లవెల్లి అశోక్, పార్టీ మండలాధ్యక్షుడు బాలచంద్రం, రాజాగౌడ్, ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బలవంత్ రావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.