calender_icon.png 18 July, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశాన్ని మోదీ ఎటు తీసుకెళ్తున్నారు?

09-04-2025 12:00:00 AM

భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోదీ మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, నిజమైన సెక్యూలర్ పాలన కావాలని అనుకొనే వారికి ఆయన నిర్ణయాలు ఒకింత సంతృప్తిని ఇస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి. కొం దరు ప్రత్యేకించి సైద్ధాంతిక, మతదృష్టి, రాజకీయ, ఓటుబ్యాంకు ప్రయోజనాల కారణంగా తప్పితే ఆయన పాలనా వ్యవహారాలు, సాహసోపేత నిర్ణయాల పట్ల సాధారణ సామరస్య పూర్వక జీవన విధానాన్ని కోరుకొనే జనంతోపాటు తటస్థ విశ్లేషకులూ తమ మౌనంతో ఆమోదం తెలుపుతున్నారని చెప్పాలి.

ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వ నాయకుడిగా ఉన్న ప్రధాని మోదీ అత్యంత వివాదాస్పద వక్ఫ్ బిల్లును ఆమోదింప చేసుకోవడంలో కచ్చితంగా విఫలమవుతారనే విపక్షాలు భావించడమేకాక ఆ మేరకు ఆశించాయి కూడా. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ఆ బిల్లును చట్టసభలలో నెగ్గించుకోగలిగారు. దేశానికి మూడో పర్యాయ ప్ర ధానిగా మోదీ చూపుతున్న, తీసుకుంటు న్న ధైర్యోపేత నిర్ణయాలు ఇక ముందుకూ డా ఆగవని నిరూపిస్తున్నట్టుగానూ మొ త్తంగా ఈ పరిస్థితి సంకేతాన్ని ఇస్తున్నది.

జమ్మూ కాశ్మీర్ నుంచి ‘ఆర్టికల్ 370’ను ఎత్తివేయడం కంటే కూడా వక్ఫ్ సవరణలను బహుశా పెద్ద వివాదస్పద సంస్కరణగానే భావించ వలసి ఉంది. ఎందుకంటే, వాటి ప్రభావం ప్రత్యక్షంగా, దేశవ్యాప్తంగా ఉంటుంది కనుక. ఈ నేపథ్యంలోనే మోదీ 3.0 సాధించిన ఒకానొక అద్భుత విజయంగా ‘2025 వక్ఫ్ సవరణల చట్టం’ చరిత్ర సృష్టించింది. గత సంవ త్సరం జూన్ 4న, బీజేపీ 240 లోక్‌సభ స్థానాలతో మెజారిటీ మార్కుకంటే తక్కు వ స్థాయిలో విజయం సాధించినప్పుడు, ఆ పార్టీ మద్దతుదారులలోనే చాలామంది సంకీర్ణ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ ఎజెండాను తప్పక దెబ్బ తీస్తుందేమో అని ఒకింత నిరాశ చెందారు. ‘కాశ్మీర్ నుంచి ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయడం, రామమందిరం నిర్మించడానికి మార్గం సుగమం చేయడం, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడం వంటి చారిత్రాత్మక, అత్యంత సాహసోపేత చర్య లు వంటివి బీజేపీ ఇక ముందు తీసుకోగలదా?’ అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి కూడా.

సమతుల్యతను సాధించడం కోసమే!

వక్ఫ్ ఎండోమెంట్‌ల పవిత్రతను కాపాడటం, సమాజ ప్రయోజనం కోసం వాటి సరైన నిర్వహణను నిర్ధారించడం, అందరు వాటాదారులకు న్యాయమైన, పారదర్శకత, తగిన ప్రక్రియ సూత్రాలను సమర్థిం చడం మధ్య మెరుగైన సమతుల్యతను సాధించడమే ఈ సవరణల ప్రధాన లక్ష్యం గా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామ ర్థ్యం, అభివృద్ధి (యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశమంతటా ఒక ముఖ్యమైన, ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. ఇందులో ఆశ్చర్యకరమైన విష యం ఏమిటంటే, ఓటమిలో కూడా ప్రతిపక్షం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్న ది.

మూడోసారి కూడా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాక పోవడం, తన ప్రభు త్వం పతనమవడం, మోదీ గ్రాఫ్ ప్రజల్లో క్రమక్రమంగా స్థిర పడుతుండటం లేదా బీజేపీని అధికారంలోంచి పడగొట్టలేక పోతుండటం వంటి పరిణామాల కారణంగా ఇక భవిష్యత్తు చాలా కష్టమని భావి స్తున్నట్టుగానూ వుంది. కాంగ్రెస్ వారసుడు రాహుల్‌గాంధీ కేవలం 99 సీట్ల తోనే అయినా, భారతదేశంలో కాంగ్రెస్ ఎన్నికల విజయం సాధించినట్లుగానే మా ట్లాడటం, ప్రవర్తించడం ప్రారంభించారు. కానీ నెలల్లోనే, హర్యానాలో వారి కొత్త ఆశలు, భావి అంచనాలకు విరుద్ధంగా బీజేపీ అద్భుత విజయం సాధించింది. తర్వాత మెజారిటీకి కొద్ది దూరంలోనే ఉన్న మహారాష్ట్రను సొంతంగా కైవసం చే సుకుని, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో దాదాపు అన్ని కీలకమైన ఉపఎన్ని కలలో బీజేపీ విజయం సాధించింది.

ఆ నాయకులను కష్టపడి ఒప్పించారు!

ఇదంతా జరుగుతుండగా, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తన వేగాన్ని కోల్పోయింది. దాని ఇండీ కూట మి, మిత్రపక్షాలు కాంగ్రెస్ అతివిశ్వాస, అహంకార పూరిత వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాయి. ఈ రకం గా దేశంలోని మొత్తం ప్రతిపక్ష కూటమి ఇప్పుడు దాదాపు విచ్ఛిన్నమైంది. ఈ తరుణంలోనే, మోదీ 3.0 సాధించిన అత్యంత అద్భుతమైన విజయం ‘2025 వక్ఫ్ సవరణ’ చట్టరూపంలోకి వచ్చింది. మొన్నటి వరకూ కేంద్రంలో సంకీర్ణంలో ఉన్న బీజేపీకి దాన్ని ముట్టుకోనే ధైర్యం ఉండదని అందరూ భావించారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ‘ఆర్టికల్ 370’ను ఎత్తివేయడం కంటే వక్ఫ్ సవరణలు బహుశా పెద్ద నాగరిక సంస్కరణ కావచ్చు.

ఎందుకంటే, వా టి ప్రభావం ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా ఉం టుంది. ‘1995 వక్ఫ్ చట్టం’ బహుశా స్వ తంత్ర భారతదేశంలోనే అత్యంత నష్టదాయకమైంది. ఉదా॥కు, చట్టంలోని సెక్షన్ 40, బోర్డులు ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తి గా మార్చడానికి అనుమతించింది. భారతదేశంలోని ఏ ఇతర మతసంస్థ (హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ లేదా జైన), ఏ ఆస్తిని ఇలా ఏకపక్షంగా దాని మతపరమైన ట్రస్ట్ లో భాగంగా ప్రకటించుకునే చట్టబద్ధమైన హక్కును పొందలేదు. ప్రస్తుత కొత్త సవరణ తర్వాత, సెక్షన్ 40 రద్దు చేయడమైం ది. 2024 నుంచే బీజేపీ.. చంద్రబాబు నా యుడు, దేవెగౌడ, నితీష్‌కుమార్ వంటి మిత్రపక్ష నాయకులను చాలా కష్టపడి ఒప్పించడం ప్రారంభించింది. భారీయుక్తు లు, సర్దుబాట్లు జరిగాయనీ తెలుస్తున్నది. పిమ్మటే, ప్రభుత్వం బిల్లును ప్రతిపక్ష స భ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీకి పంపింది, చివరికి ఆమోదం లభించింది.

వక్ఫ్ దుర్వినియోగానికి సంబంధించిన అధిక సాక్ష్యాల గురించి ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యక్తిగతంగా అంగీకరించాయని బీజే పీ వర్గాలు చెబుతున్నాయి. వేలాదిమంది ముస్లింలు కూడా నిరాశాజనకమైన వ్యా జ్యాలలో చిక్కుకున్నారు. దీనివల్ల సమాజంలోని పెద్ద వర్గం కొత్త సవరణలను స్వాగతిం చింది. చివరికి, నవీన్ పట్నాయక్ సైతం పార్టీ విప్ జారీ చేయడానికి బదులుగా, బీజే డీ ఎంపీలు తమ మనస్సాక్షికి అనుగుణంగా వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆఖరకు ‘2025 వక్ఫ్ సవరణల’ బిల్లు లోక్‌సభలో 288-- ఓట్లతో, రాజ్యసభలో 128- ఓట్ల తో సునాయాసంగా ఆమోదం పొందింది. చివరికి, నరేంద్ర మోదీ అనే సాహసికుడు దేశానికి మరో నాగరిక సామాజిక సంస్కరణను చట్టరూపంలోకి తేగలిగారు.

రాహుల్ మౌనం, ప్రియాంక గౌర్హాజరు

రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలు చట్టసభలో ‘వక్ఫ్ బిల్లు’ చర్చనుంచి ఎందుకు తప్పించుకున్నారు? లోక్‌సభలో వేడిగా జరిగిన వక్ఫ్ సవరణ బిల్లు చర్చల సమయంలో రాహుల్‌గాంధీ ఎక్కువగా హాజరు కాకపోవడం విశ్లేషకులకు వింతగానే అనిపిస్తున్నది. బిల్లు ఓటింగ్‌కు ముందు ఆయన సభలోకి ప్రవేశించినా, ఈ విషయంపై మాట్లాడలేదు. ప్రియాంక గాంధీవాద్రా వక్ఫ్ చర్చ అంతటా గైర్హాజరయ్యారు. ఓటు వేయడానికి రాలేదు. ‘దేశం ఎంతో ఆశతో చూసే వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ, పార్టీ విప్ ఉన్నప్పటికీ పార్లమెంటుకు రాలేదు. ఇదొక మచ్చగా మిగిలి పోతుంది. బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్న ఎప్పటికీ అలాగే ఉంటుంది..’ అన్న విమర్శలు ఆమెపై వచ్చాయి. 

పైన పేర్కొన్న సాహసోపేత నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీకి అసలు ఎలా సాధ్యమయ్యాయి? ఇంకా ఏమేమి చేయబోతు న్నారు? ఇంతకూ, ఈ రకమైన ఒంటెత్తు (ఏకపక్ష) పోకడలతో ఆయన దేశాన్ని, ప్రజలను ఎటు తీసుకెళ్తున్నారు? భారతదేశాన్ని మొత్తంగా హిందూ అనుకూలత వైపు నడిపించడం ద్వారా తాను ఏం సాధించను న్నారు? దేశంలోని ముస్లిం సమాజానికి అన్యాయం చేయరు కదా? వంటి మౌలిక సందేహాలు చాలామంది విపక్ష, వామపక్ష, హిందూ వ్యతిరేక భావజాలం గల వారిలో నెలకొని ఉన్నాయి. రానున్న కాలమే వీటన్నింటికీ సమాధానం చెప్పాలి.