09-04-2025 12:00:00 AM
అమెరికా విధించిన ప్రతీకార సుంకాలపై దీటుగా చైనా స్పందిస్తూ అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాలు ప్రకటించింది. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైనాకు డెడ్‌లైన్ విధించారు. సుంకాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఈ నెల 8 నాటికి వెనక్కి తీసుకోవాలని, లేదంటే చైనా దిగుమతులపై ఈ నెల 9 నుంచి 50 శాతం అదనపు సుంకాలను అమలు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ తరుణంలోనే అమెరికా హెచ్చరికలకు భయపడబోమని చైనా సుస్పష్ట సంకేతాలు పంపింది.
అమెరికా ప్రతీకార సుంకాలపై చైనా ఢీ అంటే ఢీ అంటోంది. తమపై టారిఫ్‌లు పెంచుతామని హెచ్చరిస్తూ అమెరికా తప్పు మీద తప్పు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ట్రంప్ బెదిరింపులు అమెరికా బ్లాక్‌మెయిల్ విధానాలను మరోసారి బహిర్గతం చేస్తున్నాయని పేర్కొంది. ఈ బెదిరింపులను తాము ఏ మాత్రం పట్టించుకోమని చైనా కరాఖండిగా ప్రకటించింది. కంపెనీలు సాధారణంగా డిమాండ్ సప్లు సూత్రం ప్రకారం పని చేస్తాయి.
ఏదైనా ఒక దేశం ఒక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని అడ్డగోలుగా సుంకాలు విధిస్తే ఆయా రంగాల్లోని కంపెనీ ఉత్పత్తుల ఎగుమతి డిమాండ్ తగ్గుతుంది. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో సుంకాలు విధించిన దేశంలో ఉత్పత్తుల ఖరీదు పెరుగుతుంది. దీంతో అమ్మకాలు తగ్గి క్రమంగా మార్కెట్ విలువ పతనానికి దారితీస్తుంది. ఈ భయమే ఇటీవల మార్కెట్లు భారీ స్థాయిలో పతనం కావడానికి ప్రధాన కారణం. అధిక సుంకాల వల్ల భవిష్యత్తు గందరగోళంలో పడటంతో మదుపర్లు అమ్మకాలపై ఆసక్తి చూపారు.
దీంతో అమెరికా సహా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారంనాటి ట్రేడింగ్‌లో దేశీయంగా రూ.14లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నిపుణులు ప్రతీకార సుంకాల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు, ఆర్థికమాంద్యం వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో ట్రంప్‌నకు బాగా దగ్గరైన టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ టారిఫ్‌లపై అమెరికా వెనక్కి తగ్గాలని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అమీతుమీకి చైనా సిద్ధమైన తరుణంలో ఆ దేశంపై విధించే టారిఫ్‌లపై పునరాలోచించాలని ట్రంప్‌కు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతు తెలిపిన బిలియనీర్ బిల్ అక్మెన్ కూడా ట్రంప్ సుంకాలను తప్పుబట్టారు.
టారిఫ్ పాలసీని ఒక ఆర్థిక అణుయుద్ధంగా ఆయన అభివర్ణించారు. ట్రంప్ ఆర్థికవేత్త కానందున పాలసీ తయారీకి వీలుగా వీటిని గణించేందుకు సలహాదారులపై ఆధారపడ్డారని అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు లెక్కల కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థను కిందకు లాగుతున్నారని అక్మెన్ విమర్శించారు. ప్రతీకార సుంకాల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ సీఈవో జెమి డిమోన్ అంచనా వేశారు. అలాగే అలీన దేశాలైన భారత్, బ్రెజిల్ వంటి దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే, టారిఫ్‌ల ద్వారా మార్కెట్‌లలో అమెరికా సృష్టించిన అనిశ్చితి ఎంత నష్టం చేకూరుస్తుందనే విషయం ఇప్పుడప్పుడే తేలడం కష్టం.