09-04-2025 12:00:00 AM
అమాత్య మూలాః సర్వారంభాః
జనపదస్య కర్మసిద్ధయః
స్వతః పరతశ్చ యోగసాధనం
వ్యసన ప్రతీకారః శూన్యనివేశోపచయౌ
దండకరానుగ్రహశ్చేతి..
కౌటిలీయం: (8.1)
“జనపదంలో అన్ని పనుల ఆరంభం, ఆయా పనులు సిద్ధించడం. తన వారు, పరవారి నుంచి ఎదురయ్యే యోగక్షేమాలు, వ్యసనాలకు ప్రతిక్రియలు, శూన్య స్థానాలలో గ్రామాదులను నెలకొల్పడం, దండనలను విధించడం, అనుగ్రహించడం, లాభాలను ఆర్జించడం.. వంటివన్నీ అమాత్యునిపైనే ఆధారపడి ఉంటాయి” అంటారు ఆచార్య చాణక్య. జనపదం ఒక సంస్థ అనుకుంటే అమాత్యుడు అందులో నాయకుడు (సీఈవో). సంస్థలోని అన్ని కార్యక్రమాలకు, లాభనష్టాలకు, వ్యూహప్రతివ్యూహాలకు, అవకాశాలు లేని ప్రాంతాల లో కొత్తగా వాటిని సృజించుకోవడంలో, పనితీరు ప్రాతిపదికగా ఉద్యోగులను సన్మానించడం లేదా శిక్షించడానికి, సహచరుల శక్తి సామర్థ్యాలను ఉన్నతీకరించుకునే ప్రక్రియలో సహాయ పడేందుకు నాయకుడే బాధ్యుడు.
నాయకత్వం నిజానికి అభ్యుదయం, సంక్షేమం, వేగం, దృఢత్వం, ప్రణాళికలు రచిస్తూ వాటిని సాకారం చేయడం, వినియోగదారులకు ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం, లాభార్జన వంటి పలు అంశాల మధ్య సమతుల్యత సాధించడానికి ప్రతీకగా చెప్పాలి. ఎన్ని ఆలోచనలు చేసినా, ప్రణాళికలు ప్రతిభావంతంగా రచించినా వాటిని ప్రభావవంతంగా అమలు చేయడంలోనే నాయకుని జయాపజయాలు నిశ్చయమవుతాయి.
సరైన పనులను చేయడం నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. అలాగే, సరిగా పనిచేయడం నిర్వహక సామర్థ్యానికి ప్రతీక. చేయవలసిన దానిని చేయక పోవడం, చే యకూడని దానిని చేయడం ‘అక్రాసియా’ అంటారు. అది నిర్వాహకులకు, నాయకులకు అపజయాన్ని ఇస్తుంది. తమ అసమ ర్థతను కప్పి పుచ్చుకోవడం లేదా కర్తవ్యాన్ని వాయిదా వేసుకోవడానికై పరాజి తులు పలు కారణాలను చెప్తారు. ఎలాగైతే తాజ్‌మహల్ నిర్మాణం ఒకరోజే జరగలేదో అలాగే ఫలితాలూ నెమ్మదిగా వస్తా యని చెప్తారే కాని తాజ్‌మహల్ ప్రతిరో జూ నిర్మాణం కొనసాగింది, రోజూ కొంత అభివృద్ధి జరిగిందనే దానిని వారు ఆలోచించరు.
అంతరంగంలో సాధించాలనే జ్వలన, కొత్తదనాన్ని సృజించాలనే పట్టుదల, అనుక్షణం నేర్చుకోవాలనే జిజ్ఞాస, నిరంతర అభ్యాసం ద్వారా నైపుణ్యాలకు పదను పెట్టుకోవాలనే తపన లేని పరాజితులు అనుచరులైతే నాయకుడు సమర్థుడై నా అపజయం పాలవుతాడు. పోటీదారు లు ఎక్కువగా ఉండి, నాణ్యత సృజనాత్మకత కలిగిన ఉత్పత్తులు/ సేవలు అత్యంత చౌక గా అందించేందుకు అంతర్జాతీయ సంస్థలుకూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంది. కొనుగోలుదారులు కేంద్రంగా, ఉత్పత్తులు కేంద్రంగా, ఉద్యోగులు, బృందాలు కేంద్రంగా, విపణివీధి కేంద్రంగా వ్యూహాలు రచించి వాటిని సమర్థవంతంగా ఆచరణలో పెడితేనే అంగడిలో నిలదొక్కుకోగలుగుతారే కాని పాత పద్ధతులతో విపణిలో నిలవడం సాధ్యపడదు.
నాయకుని దార్శనికత
సంస్థను నెలకొల్పిన నాయకుడు దాని కి తానే అధిపతినని భావిస్తాడు. కాని, ఎక్కువమంది తమ వ్యాపారానికి తామే బానిస లుగా మారిపోతారు. ఎక్కువ శాతం వ్యాపారస్థులకు స్వయంసమృద్ధిని సాధించడం కాదు కదా నెలవారీ ఖర్చులు సమకూర్చుకోవడమే సమస్యగా మారి వ్యాపార విస్తర ణకు అవసరమైన కొత్త ఆలోచనలకు సమ యం సరిపోదు. సంస్థ లక్ష్యాల ను నిర్ణయించడంలో నాయకుని దార్శనికత ముఖ్యభూ మిక పోషిస్తుంది. ఇతరులవి లేదా తమ గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని, పరిమిత లక్ష్యాలే సురక్షితమని భావించడం వల్ల సౌకర్యవంతమైన వలయం నుంచి బయటకు రాలేం. ఆశించిన అభ్యుదయ మూ మృగతృష్ణగా మారుతుంది.
ఒకరి అభిప్రాయాన్ని తప్పని నిరూపించడానికో లేదా బృందంలో ఒక విభాగాన్ని అసమర్థమైందని నిరూపించడానికో చేసే ప్రయత్నం లక్ష్యసాధనకు ఉపకరించదు సరికదా, అపజయాన్ని స్వాగతిస్తుంది. అలా కాక సాధిం చాలనే ఒకే ఆశయంతో స్వేఛ్చగా, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తూ, సమున్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, దీక్షాదక్షతలతో ప్రయ త్నించే నాయకుడు ఉత్తమ ఫలితాలను పొందుతాడు. భవిష్యత్తును శాసిస్తాడు. భవి త అంటేనే మన గమ్యం. చాలా శక్తివంతమైన ఆశయంతో ప్రేరితమైన లక్ష్యం వ్యక్తిగ తం కాకుండా బృందలక్ష్యంగా మారాలి. అప్పుడు అది అడ్డంకులను అధిగమించే బలాన్ని ఇవ్వడమే కాక అనుక్షణం ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంది. నాయకుని లోనూ, అతని బృందంలోనూ సానుకూల పరివర్తన తెస్తుంది.
కార్యనిర్వహణా సామర్థ్యం, వ్యూహరచనలో వేగం, కార్యాచరణలో స్థిరత్వం, ఆలోచనలలో స్పష్టత వల్ల లక్ష్యాన్ని ఎలా సాధించామో తెలుస్తుంది. సంస్థలో పని సంస్కతిని నెలకొల్పడం, సమర్థత, నిబద్ధత, నైపుణ్యం ప్రాతిపదికగా బృందాలను ఏర్పరుచుకున్న నాయకుడు వ్యాపారంలో తన స్థానాన్ని ఉన్నతీకరించుకో గలుగుతాడు. భావ వ్యక్తీకరణలో స్పష్టతవల్ల బృంద సామర్థ్యం పెరుగుతుంది. నాయకుడు, అనుచరులు వాడే భాష ఆ సంస్థ సంస్కృతికి అద్దం పడుతుంది.
ఒకరిపట్ల ఒకరి నమ్మకాలు, ఆలోచనలు, స్పందనలు, కార్యాచరణలు సంస్థ సమర్థతను తెలుపుతాయి. తప్పు తమదికాదు మరొకరిదంటూ ఒకరి నొకరు నిందించుకోవడం, ఉత్తమ ఫలితాలను సాధించిన విభాగంపై మరొక విభాగం పెంచుకునే అసూయాద్వేషాలు, ఏమీ చేయలేని నాయకుని నిస్సహా యత, తప్పుచేసామనే అపరాధ భావనలు, మార్పు అసాధ్యమనే ఉదాసీనత, ప్రస్తుత పరిస్థితియే ఉత్తమమంటూ ఆశయాలకు పరిధులను ఏర్పరుచుకోవడం వంటివన్నీ అపజయానికి నాంది పలుకుతాయి.
నాయకుడు లక్ష్యాన్ని నిర్ణయించ గానే అది అసాధ్యమంటూ పలు కారణాలు చెబుతూ సాధారణంగా అనుచరు లు ఆ ఆలోచనను తిరస్కరిస్తారు. నిజానికి అసాధ్యమంటే అప్పటికి దానిని సాధించే మార్గం మనకు తెలియదనే కాని సాధ్యపడదని కాదు. పరిష్కారం కనుగొనలేని నిస్సహాయత ఆలోచనల పరిధిని సంకుచితం చేస్తూ వాయిదా జబ్బును ప్రసాది స్తుంది. దీనిని నాయకుడు అధిగమించగలగాలి. లాభాలు నిరాటంకంగా వస్తేనే ఉద్యోగులకు ఉపాధి, సంస్థకు ఉనికి. తద్వారా దేశానికీ ప్రగతి, ప్రజలకు సుగతి.
-పాలకుర్తి రామమూర్తి