calender_icon.png 16 December, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజంపేట రాజు ఎవరు?

16-12-2025 12:00:00 AM

  1. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు.. మొదటిసారి ఎన్నికలు
  2. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు
  3. అభ్యర్థుల తరఫున హేమాహేమీల ప్రచారం
  4. పెద్ద నాయకులకు సవాల్‌గా ఎన్నికలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీ గా ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు అన్ని పార్టీల కు సవాల్‌గా మారాయి. ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు అయిన అనంతరం మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను మున్సి పాలిటీగా ఏర్పాటు చేయడంతో, ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న రాజంపేట ప్రాంతాన్ని గ్రామపంచాయతీగా ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది.

మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ పంచాయతీపైనే కేంద్రీకృతమైంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని సుమారు 25 శాతం భూభాగం రాజంపేట పంచాయతీ పరిధిలో ఉండటంతో సర్పంచ్ ఎన్నికకు తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు 1800లకు పైగా ఓటర్లు ఉన్న ఈ జీపీ పరిధిలో గిరిజనేతర ఓటర్లే అధికంగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ పంచాయతీ ఎస్టీకి కేటాయించారు.

గెలుపుపై ప్రధాన పార్టీల దృష్టి

రాజంపేట సర్పంచ్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. సర్పంచ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ ఎం ఈఓ నాంపల్లి శంకర్‌కు మద్దతు తెలుపుతోం ది. బీఆర్‌ఎస్ పార్టీ తుడుం దెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రిటైర్డ్ ఉద్యోగి బుర్సా పోచ్చయ్యకు మద్దతుగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా, ఆదివాసీలకు సుపరిచితుడైన మడావి రాజు కుమారుడు మడావి శ్రీనివాస్‌కు బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఎటువంటి పార్టీ మద్దతు లేకుండా శ్రావణ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు.

మనుగడ కోసం ఆరాటం

జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న రాజంపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుని తమ రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు ఆయా పార్టీల నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యం గా ఎమ్మెల్యే కోవా లక్ష్మి రాజంపేట పంచాయతీ పరిధిలోనే నివసించడంతో, తమ పార్టీ మద్దతుదారుడు పోచ్చయ్యను ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగి ఇంటిం టా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అనుచరుడిగా పేరున్న శంకర్ను గెలిపించుకునేందుకు ఆయ న వర్గీయులతో పాటు మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ ను గెలిపించి కాషాయ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు.మొత్తానికి రాజంపేట సర్పంచ్ ఎన్నికలు ఆయా పార్టీల బడా నాయకులకు గట్టి సవాల్గా మారాయి.