11-08-2025 12:00:00 AM
-పుట్ట గొడుగుల్ల బెల్ట్ షాపులు
-మామూళ్ల మత్తులో అబ్కారీ అధికారులు
నల్లగొండ టౌన్, ఆగస్టు 10: జిల్లా కేంద్రంతో పాటు పల్లెలో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటోంది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది.
వైన్, బార్ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్టు షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది. ఎప్పుడంటే అప్పుడు....ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ వైన్ షాపుల మాదిరి ఇళ్లలోనే లభ్యం అవు తోంది. కిలోమీటర్ల మేర దూరంలోని వైన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే 30 రూపాయలు ఎక్కువిస్తే ఇంటి పక్కనే మద్యం దొరుకుతోంది.
వైన్ షాపులకు అనుబంధంగా...
మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో వైన్ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 155 వైన్స్ షాపులు ఉండగా ఒక్కో షాపు పరిధిలో కనీసం 30 చొప్పున బెల్టు షాపులు అనుబంధంగా పని చేస్తున్నాయి.
తమ టార్గెట్లు చేరుకొనేందుకు బెల్టు షాపులను ఏర్పాటు చేయిస్తూ, అక్రమంగా మద్యం అమ్మకాలు సాగించేలా వైన్షాపుల నిర్వా హకులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైన్షాపుల నుంచి ఎమ్మార్పీ ధరలకు కొనుగోలు చేస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్ బాట్పి రూ.20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి.
వైన్సుల్లో స్పెషల్ కౌంటర్..
ఈ బెల్ట్ షాపుల నిర్వహకులకు మద్యం అమ్మేందుకు వైన్సుల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాధరణంగా వినియోగదారులకు ఇచ్చే కౌంటర్తో పాటు పక్కనే ప్రత్యేక షెట్టర్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. చట్టపరంగా ఒక వ్యక్తికి పరిమిత స్థాయిలోనే మద్యం అమ్మాలి. కానీ బెల్ట్ నిర్వహకుల నుంచి అక్రమంగా వసూళు చేసుకుని ఎన్నంటే అన్ని కాటన్లు ఇచ్చేస్తున్నారు. వీరు ఇస్తున్న అండతో బెల్టు షాపుల్లో విచ్చలవిడి అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
కిరాణ కొట్టులే.. బెల్ట్ షాపులు..
ఒకప్పుడు బెల్ట్ షాపులు రెండు మూడు భయంభయంగా నిర్వహించేవారు. కానీ నేడు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అయితే బెల్ట్ షాపులంటే మద్యం దుకాణాల్లా కనిపించవు. కిరణాషాపుల్లోనే చాలావరకు మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఏ రాత్రి వెళ్లినా వీరి వద్ద మద్యం లభిస్తుంది. ఎన్నికల సమయంలో అడపాదడపా దాడులు చేసే ఆబ్కారీ శాఖ, పోలీసులు మళ్లీ గ్రామాల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టారీతిన అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
అక్రమంగా సిట్టింగ్లు ఏర్పాటు...
పట్టణంలో బెల్టు షాపుల్లో సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నా పట్టించుకొనేవారు లేరు. ఆహార పదార్థాలు తయారు చేస్తూ మందుబాబులకు అందజేస్తున్నారు. బెల్టు షాపుల మధ్య పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకర్శించేందుకు ఇళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరిగా బెల్టు షాపుల్లో చికెన్, మటన్, గుడ్లు, ఆమ్లేట్, తదితర ఆహార పదార్థాలను వండి అందజేస్తున్నారు.
నిద్రావస్థలో అబ్కారీశాఖ....
విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నా అబ్కారీశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించు కోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లిప్తతతో మద్యం కల్తీ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెల్టు షాపుల్లో మద్యం కల్తీ విపరీతంగా జరుగుతున్నట్లు ఆరోపణలు న్నాయి. కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వైన్ షాపులు, బెల్టు షాపుల నుంచి మామూళ్లు అందుకుంటున్న అబ్కారీశాఖ అధికారులు మద్యం మత్తులో జోగుతున్నారనే బహిరంగ ప్రచారం జరుగుతోంది.