calender_icon.png 26 May, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ ఖర్చు భరించేదెవరు?

26-05-2025 01:37:07 AM

-సర్కారే భరించాలన్న కాంట్రాక్టర్ల లేఖపై మీ సమాధానమేంటి!

-మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రశ్న

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతుల ఖర్చు ఈ ప్రభుత్వం భరిస్తుందా అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ప్రశ్నించారు.

ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఓవైపు చర్చ జరుగుతుంటే, సందట్లో సడేమియా అన్నట్టు కాంట్రాక్టర్లు కాళేశ్వరం పునరుద్ధణ ఖర్చంతా ప్రభుత్వమే భరించాలని లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు.

ఆదివారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో హరీశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. రెండురోజుల కింద మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్, అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్, కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల పునరుద్ధరణ ఖర్చంతా ప్రభుత్వమే భరించాలని లేఖ రాశారని తెలిపారు.

బరాజ్‌లపై ఎన్డీఎస్‌ఏ సిఫార్సుల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే రూ.40 కోట్ల వరకు ఖర్చు కావొచ్చని, ఆ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని కాంట్రాక్టర్లు పేర్కొనడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా పాల్వాయి అభివ ర్ణించారు. అన్నారం, సుందిళ్లలో ఫైనల్ బిల్లు రూ.176 కోట్లు, ఎన్డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు చేసిన పనులకు రూ.4.5 కోట్లు ఇవ్వాలని, బ్యాంకు గ్యారంటీ మొత్తం రూ.43 కోట్లు కూడా ఇవ్వాలని గుత్తేదారు సంస్థ కోరినట్టు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయన్నారు.

కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వెలికితీయకపోగా, పునరుద్ధరణ ఖర్చు కూడా మొత్తంగా ప్రభుత్వమే భరిస్తే, ప్రజల మీద ఇంకా భారం మోపినట్టు అవుతుందన్నారు. కాళేశ్వరంలోని ఏడో బ్లాక్ పునర్నిర్మాణం, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల మరమ్మతుల కోసం ఎన్డీఎస్‌ఏ నివేదిక ప్రకారం పనులు చేస్తే దాదాపు రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చవుతాయని..ఈ మొ త్తం ప్రభుత్వమే భరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏడాదికి రూ.16 వేల కోట్లు సాగునీటి శాఖ లో అప్పులు, వడ్డీలకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారని ఇటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వం మీద పడితే రాష్ర్టం ఇంకా దివాళా తీసే అవకాశం ఉందన్నారు.