calender_icon.png 9 July, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంను గోకడమెందుకు.. తిరిగి తన్నించుకోవడమెందుకు..?

09-07-2025 01:15:31 AM

  1. మాజీ మంత్రి కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఫైర్ 
  2. నిధుల కోసమే ఢిల్లీకి సీఎం వెళ్లారు 
  3. కేటీఆర్‌కు సిస్టర్, బ్రదర్ ఇన్‌లా స్ట్రోక్  
  4. రివేంజ్ కోసమే అయితే పాస్‌పోర్టు కేసు తిరగతోడేవాళ్లం 
  5. అధికారం లేకపోతే గిలగిలా కొట్టుకుంటున్నారు  

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడానికి సీఎంలు ఢిల్లీకి పోతారనే ఇంగిత జ్ఙానం పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్‌కు లేదా అని మండిపడ్డారు. ‘నీవు సీఎం రేవంత్‌రెడ్డిని గోకుడమెందుకు.. తిరిగి తన్నించుకోవడం ఎందుకు.. మీ అయ్య ఒక బూత్ పదం మాట్లాడితే..

రేవంత్‌రెడ్డి పది తిడుతారు. నీవు బూతులు మాట్లాడం బంద్ చేస్తే సీఎం కూడా బంద్ చేస్తారు. ఈ విషయంలో మా లైన్ క్లియర్. 10 ఏళ్లు అధికారం అనుభవించి.. 18 నెలలు పవర్ లేకపోయే సరికి  ఒడ్డుమీద పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటున్నావు’ అని కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ఎరువులు, నిధులు, నీళ్ల పంచాయితీ కోసం ఢిల్లీకి పోతే.. కేసీఆర్ కుటుంబం మాత్రం లిక్కర్ దందా కోసమే ఢిల్లీకి వెళ్లిందని విమర్శించారు.

మంగళవారం ఆయన గాంధీభన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నీకు.. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చలు చేయాలా? రోడ్డు మీద చర్చ చేయాలా? అనే జ్ఞానం లేదా? నెలలో పది రోజులు ఇక్కడ.. 20 రోజులు విదేశాల్లో  ఉంటున్నందునే సీఎం షెడ్యూల్ నీకు తెలియడం లేదు. నీకు విదేశాల్లో ఏమి పని. విదేశాల్లో తిరిగితే సీఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ఎలా తెలుస్తుంది’ అని జగ్గారెడ్డి నిలదీశారు. 

‘అందరికి వడదెబ్బ తగిలితే.. కేటీఆర్‌కు సిస్టర్, బ్రదర్ ఇన్‌లా స్ట్రోక్ తగిలింది. అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మీ స్ట్రోక్‌ల లొల్లి మాకేందుకు రుద్దుతున్నారు. కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్టు ఎమ్మెల్యే అయిన నీకు రాజకీయ ఒడుదొడుకులు ఏమీ తెలు సు? సన్నాసులు అనే మాటలను మీ అయ్యనే స్టార్ట్ చేశారు.

మేం సత్రం నడపటం లేదు.. మీరు తిడితే మేం తిడుతాం. తిట్ల పురాణం మీదే.. మీరు ఒకటి అంటే మేం పది తిడుతున్నాం. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తప్పు చేస్తుందని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇందిరమ్మ పాలనపై వేలుపెట్టే అధికారం కేటీఆర్, హరీశ్‌కు లేదు’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

పాస్‌పోర్టు కేసులో కేసీఆర్ కుటుంబమే మూలం.. 

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులను అడ్డం పెట్టుకునివేధింపులకు గురి చేశారని, తనపైన నిఘా పెట్టారని, జగ్గారెడ్డికి అప్పులు తప్ప ఆస్తులు లేవని తేలడంతో తనపై పాస్‌పోర్టు కేసుపెట్టారని మండిపడారు.తనను అరెస్టు చేస్తారని ఆరు నెలల క్రితమే  రేవంత్‌రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు.

పాస్‌పోర్టు కేసులో కేసీఆర్ కుటుంబమే మూలమన్నారు. తమ ప్రభుత్వం రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే పాస్‌పోర్టు కేసు తిరగతోడేవాళ్లమని, హరీశ్‌రావు హైదరాబాద్‌లో తిరగడనే విషయం తెలుసుకోవాలి’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు.  

కేటీఆర్ మళ్లీ వస్తానంటే..అప్పుడు నేనే వెళతా

అభివృద్ధిపై చర్చకు రావాలని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరితే కేటీఆర్‌కు చర్చకు రావడమేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆరే ముందుకొచ్చి చర్చకు రావాలని కోరితే.. నేను అప్పుడు సీఎంను ఒప్పిస్తాను. రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లు ఫస్ట్‌బెంచ్ స్టూడెంట్స్. అది వాళ్లు చూసుకుంటారు. మనిద్దరం సెకండ్ బెంచ్.. మనం చూసుకుందాం.కాంగ్రెస్ నేతలను 420 అని విమర్శలు చేస్తున్న వారు కంట్రోల్‌లో ఉండి మాట్లాడాలి’ అని ఆయన హెచ్చరించారు.