09-07-2025 12:01:16 AM
మంత్రి కొండా సురేఖ వెల్లడి..
హైదరాబాద్ (విజయక్రాంతి): వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47.64 లక్షల ఈత, తాటి మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు. ఈ మేరకు అటవీ అధికారులకు మంగళవారం మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు. 2025 సంవత్సరంలో 25 లక్షలు, 2026లో 22 లక్షల ఈత మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ నర్సరీల్లో మొత్తం 45.37 లక్షల ఈత మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
తాటి మొక్కలు కూడా 5.04 లక్షలు నాటనున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో వనమహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతానికి పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వనమహోత్సవం విజయవంతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 14,355 నర్సరీలలో 20 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.