09-07-2025 01:11:42 AM
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈనెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై చర్చించి.. తేదీల ను సైతం ప్రకటించే అవకాశం ఉంద ని విశ్వసనీయవర్గాల సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తుదిగడువు విధించిన విషయం తెలిసిందే.
దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కూడా సీరియస్‌గానే ఉంది. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకొని తేదీలను కూడా ప్రకటిస్తే.. రాష్ట్రంలో కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉండదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ ప్రణాళిక ఉవ్విళ్లూరుతోంది.
అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. అత్యంత వేగంతో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తుంది. గ్రామీణ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని తాజాగా రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లోనే రికార్డు స్థాయిలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమచేసింది. తద్వారా 70 లక్షల రైతులను చేరువయ్యే ప్రయత్నం చేసింది. దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలోనూ వేగం పెంచింది.
ప్రతీ సోమవారం వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇండ్లకు నిధులు మంజూరు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్, ఈవూకార్ రేసింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇదే అదునుగా స్థానిక పోరుకు వెళ్తే తమకు తిరుగుండదని భావిస్తున్నారు. కవిత ఎపిసోడ్ సైతం తమకు అదనపు బలాన్ని చేకూరుస్తుందని అనుకుంటున్నారు.
రాష్ట్రంలో కమలం పార్టీకి ఇటీవలనే కొత్త దళాధిపతి ఎన్నికైన నేపథ్యంలో.. ఆ పార్టీ స్థానిక పోరుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా లేదని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఈనెల 14న సూర్యాపేట జిల్లా తుంగతూర్తిలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల తేదీలను ప్రకటిస్తే కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.