09-07-2025 12:03:12 AM
-పాడి పరిశ్రమకు రుణాలు
-ఔత్సాహికులకు కేంద్రం ప్రోత్సాహం
-సెంట్రల్ లైవ్‌స్టాక్ స్కీమ్ కింద సబ్సిడీ
-అవగాహన లేక ఆదరణ కరువు
మెదక్, జూలై 8(విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు మాంసం ఉత్పత్తులను పెంచే లక్ష్యం తో కేంద్ర పశు సంవర్థకశాఖ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) పథకాన్ని అమ లు చేస్తోంది. ఇందులో భాగంగా పశువుల ఉత్పాదకతను పెంచడంతో పాటు పశువులకు మేత, దాణా పరిశ్రమలను ప్రోత్సహి స్తోంది. ఈ మేరకు ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తోంది. సబ్సిడీ పొందిన వారు ఐదేళ్ల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. లేదంటే ఇచ్చిన నిధులను అధికారులు రికవరీ చేస్తారు.
దరఖాస్తు చేసుకోండి ఇలా..
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు, పందుల పెంపకం కోసం 18 ఏళ్లు పైబడిన వారు వ్యక్తిగతంగా లేదా సామూహికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల వారు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. www.nlm.udyamimitra.in అనే వ్బుసైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన పత్రాలు..
ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ (ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాసుబుక్), కులధ్రువీకరణ, భూమి పట్టాదారు పాసుపుస్తకం, విద్యార్హత పత్రాలు, పాన్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం, పాస్ పోర్టు సైజ్ ఫోటో, ప్రాజెక్టు ఏరియా ఫోటో, ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ మ్యాండేట్ ఫారమ్, క్యాన్సిల్ చెక్కు, వెటర్నరీ డాక్టర్ చేత ధ్రువీకరించిన అనుభవం సర్టిఫికెట్, సీఏ చేత ధ్రువీకరించిన డిటైయిల్ ప్రాజెక్టు రిపోర్టు.. ఇలా 13 రకాల పత్రాలను దరఖాస్తుతో పాటు జతచేయాల్సి ఉంటుంది.
అవగాహన లేక ఆదరణ కరువు...
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకానికి కేంద్రం 2021-22 సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా సబ్సిడీ కింద రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఈ పథకంపై అవగాహన లేకపోవడం, పథకం పూర్తి సమాచారం తెలియక చాలా మంది ముందుకు రావడం లేదు.
రెండు స్థాయిల్లో ఆమోదం...
జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులు రాష్ట్ర, దేశ స్థాయిలో అమోదం పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ స్థాయి అధికారితో కూడిన స్టేట్ లెవల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, దేశ స్థాయిలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఉంటాయి. జిల్లా స్థాయిలో వచ్చిన 42 దరఖాస్తులను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించారు. అక్కడ కమిటీ సభ్యులు కేవలం ఐదు మాత్రమే ఆమోదించారు. స్టేట్ లెవల్ కమిటీ ఆమోదించిన దరఖాస్తులకు బ్యాంకులు రుణాలు మంజూరు (లెంటర్ అప్రూవల్) చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు 42 దరఖాస్తుల్లో ఐదింటికి మాత్రమే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. వీటిని సెంట్రల్ లెవల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి పంపించారు.
దళారులను నమ్మొద్దు..
ఔత్సాహికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా లోన్ మంజూరు చేయిస్తాం, సబ్సిడీ ఇప్పిస్తా మంటే నమ్మొద్దు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పటి 42 దరఖాస్తుల్లో ఐదింటికి ఆమోదం లభించింది. మిగతావి ప్రాసెస్లో ఉన్నాయి.
వెంకటయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి