09-07-2025 12:19:17 AM
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఘట్ కేసర్, జూలై 8 : వందల ఏళ్ల నాటి తాటి చెట్లను నరికివేయకుండా సమీపంలోని ప్రభుత్వ స్థలంలో రీప్లేస్ చెయ్యాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల్ లో సర్వే నెంబర్లు 311, 312, 313, 324, 326పార్టు, 327 పార్టులో హెచ్‌ఎండీఏ వెంచర్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు తాటిచెట్లను నరికివేస్తుండగా గీత కార్మికులు అడ్డుకుని ధర్నా చేపట్టారు.
మంగళవారం వీరికి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉపయోగాలున్న తాటిచెట్లు ఏపుగా పెరగడానికి చాలా ఏళ్లు పడుతుందన్నారు. వందల సంవత్సరాల నాటి తాటిచెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించి, గీత కార్మికుల పొట్టకొట్టవద్దన్నారు. సుమారు 300 కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. వీరికి అన్యాయం జరిగితే సహించేదిలేదని హెచ్చరించారు.
కీత కార్మికుల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, బీబ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఎనుగు సుదర్శన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గీత కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని ప్రకటించారు. ఈకార్యక్రమంలో నాయకులు పల్లె బాబూరావు, దేశం బాలరాజ్ గౌడ్, కుర్ర విఘ్నేశ్వర్ గౌడ్, అనిల్ గౌడ్, కట్ట దర్శన్, భాస్కర్, నగేష్, వెంకట్, గీత కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.