09-07-2025 12:03:24 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జూలై 8 (విజయక్రాంతి): రాజధాని హైదరాబాద్ మంగళ వారం వరుస బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడింది. సిటీ సివిల్ కోర్టు, రాజ్‌భవన్ పాటు పలు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టామంటూ ఆగంతకులు పంపిన ఈ తీవ్ర కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, రంగంలోకి దిగారు.
కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మర తనిఖీలు చేశారు. గంటల తరబడి సోదాలు నిర్వహించినా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో ఇదొక ఉత్తి బెదిరింపేనని ప్రాథమికం గా నిర్ధారించి, అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఒకేసారి పలుచోట్ల
మంగళవారం తెల్లవారుజామున 3:15 గంటలకు ‘అబీదా అబ్దుల్లా’ అనే పేరుతో అధికారులకు ఒక ఈ వచ్చింది. ‘హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, జడ్జి క్వార్టర్స్, సికింద్రాబాద్లోని జింఖానా క్లబ్‌లో మొత్తం నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు అమర్చాం. కోర్టులో పేలుడు జరిగిన 23 నిమిషాల తర్వాత జింఖానా క్లబ్ కూడా పేలిపోతుంది’ అని ఆ మెయిల్లో ఉంది. ఉదయం 11 గంటల సమయంలో అధికారులు ఈ మెయిల్‌ను గమనించి, తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే అత్యంత కీలకమైన రాజ్‌భవన్‌కు కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో నగర పోలీస్ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది.
ఉత్తిత్తి బెదిరింపే..
గంటల తరబడి జరిపిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఇది ఆకతాయిల పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గత నెల జూన్ 18న బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు కూడా ఇలాగే ఉత్తిత్తి బాంబు బెదిరింపు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ ఈ-మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఉలిక్కిపడిన కోర్టు ప్రాంగణం
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సిటీ సివిల్ కోర్టుకు చేరుకుని కోర్టు కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులను హుటాహుటిన బయటకు పంపించి ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందా లు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి కోర్టులోని ప్రతి గదిని, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే సమయంలో రాజ్‌భవన్, జింఖా నా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టు వద్ద కూడా భారీ భద్రత నడుమ సోదాలు నిర్వహించారు.