calender_icon.png 26 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యజమాని ఇంట్లోనే భారీ దోపిడీకి స్కెచ్

26-11-2025 12:46:55 AM

-డబ్బు ఆశతో ఆయన్ని చంపేందుకు సిద్ధపడ్డ వాచ్‌మెన్  

-ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): నమ్మకంగా ఉంటాడనుకున్న వాచ్‌మెన్ నమ్మకద్రోహానికి ఒడి గట్టాడు. జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న వ్యాపారి అజయ్ అగర్వాల్ ఇంట్లో రాధాచంద్ (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. యజమాని ఆస్తులపై కన్నేసిన రాధాచంద్ ఎలాగైనా ఆ ఇంట్లో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మరో ఐదుగురు దుండగులతో కలిసి పక్కా పథకం రచించాడు.ప్లాన్ ప్రకారం మంగళవారం అర్ధ రాత్రి రాధాచంద్ తన ముఠాతో కలిసి కత్తు లు, తాళ్లతో ఇంటికి చేరుకున్నాడు.

ముం దుగా ఆవరణలోని గదిలో ఉన్న డ్రైవర్ దయాచంద్‌ను బంధించేందుకు ప్రయత్నించారు. అతను ప్రతిఘటించడంతో దుండ గులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతన్ని తాళ్లతో కట్టేసి, ప్రధాన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.దుండగుల అలికిడి గమనించిన అజయ్ అగర్వాల్ కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని చుట్టుముట్టారు. దోపిడీకి యత్నిస్తున్న ప్రధాన సూత్రధారి రాధాచంద్‌తో పాటు మిగిలిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.రక్తపు మడుగులో ఉన్న డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.