23 June, 2026 | 1:05 AM

భర్తను చంపిన భార్య

23-06-2026 12:10 AM
  1. వివాహేతర సంబంధం అడ్డుగా ఉన్నాడని హత్య 
  2. నిందితురాలిని అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు 

ఎల్బీనగర్, జూన్ 23 : తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హత్య చేసి, మొదట్లో ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య... విచారణలో హత్యగా నిగ్గు తేల్చిన ఎల్బీనగర్ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఇన్స్‌పెక్టర్ వినోద్ కుమార్ తెలిపిన వివరాలు.... మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లి గ్రా మానికి చెందిన బోడ స్వరూప, బోడ నర్సింగ్ (33)  భార్యాభర్తలు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు.

ఈ నెల 20 న అద్దె ఇంట్లో నర్సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఫోన్ ద్వారా డయల్ 100 నెంబరును పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చిందన్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం నివేదికతో మృతుడు నర్సింగ్‌ది ఆత్మహత్య కాదని... హత్య అని పేర్కొన్నారు.

మృతుడి మరణానికి కారణం ఉరివేసుకోవడం కాదని... మెడ పై ఉన్న గాయాన్ని పరిశీలించి, గొంతు నులి మి చంపినట్లు వైద్యులు నివేదికలో తేల్చిచెప్పారు. దీని ఆధారంగా మృతుడి భార్య స్వరూపను  విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. మృతుడి భార్య స్వ రూపకు తన సొంత గ్రామానికి చెందిన మో హన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో కొన్ని రోజులుగా వారి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి.

తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప అతడిని అంతమొందించాలని పథకం వేసింది. ఈ నెల 20 న మధ్యాహ్నం ఇంట్లో జరిగిన గొడవను ఆసరాగా చేసుకుని నిందితురాలు తన భర్తను శారీరకంగా లొంగదీసుకుని అతని ఛాతీపై కూర్చొని తెల్లటి చున్నీతో గొంతు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసిందని తెలిపారు. ఆ తర్వాత చట్టం నుంచి తప్పించుకోవడానికి శవాన్ని ఇనుప మంచానికి చున్నీతో కట్టి అది ఆత్మహత్యగా చిత్రీకరించి చుట్టుపక్కల వారిని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు.

ఈక్రమంలో ఈనెల 22 న మధ్యా హ్నం 2  గంటల సమయంలో తమ సిబ్బం ది ప్రత్యేక బృందంతో నిందితురాలు బోడ స్వరూపను అల్కాపురి వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో ఆమె తన నేరాన్ని పూర్తిగా అంగీకరించిందని తెలిపారు. నిందితురాలి వద్ద నుండి హత్య జరిగిన వెంటనే తన ప్రియుడికి చేసిన ఫోన్ ను, తెల్లటి చున్నీని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును హత్యగా మార్చి నిందితురాలిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలిం చినట్లు తెలిపారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయంపై మరింత దర్యాప్తు జరుపుతున్నామని సిఐ తెలిపారు.