23-10-2025 02:13:26 AM
-భర్త హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్ట్
-జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి
కామారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేసిన ఘటన కు సంబంధించినవివరాలను బుధవారం సాయంత్రం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈనెల 16న గాంధారి శివారులోని చద్మల్ రోడ్డులో కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
నేరెల్‌కు చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ టీవి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు.ఈ కేసు వివరాలు ఎస్పీ వెల్లడించారు.మేడ్చల్ మల్కాజ్‌గిరికి చెందిన నరేశ్ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలా పని చేసుకునే క్రమంలో ఆంజనేయులు అనే వ్యక్తితో నవనీతకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఒకరోజు బడాపహాడ్ దర్గా వద్దకు వెళ్దామని ముగ్గురు కలిసి రెండు బైక్‌లపై వెళ్లారు. అక్కడ ఇద్దరు క్లోజ్‌గా ఉండడం గమనించిన నరేశ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు.
దాంతో నరేశ్ అడ్డు తొలగించుకోవడానికి మరోసారి బడపహాడ్ వెళ్లి వద్దామని బయలుదేరారు. గాంధారికి రాగానే అక్కడ వైన్ షాపులో మద్యం తీసుకుని చద్మల్ రోడ్డులో నరేశ్‌కు మద్యం తాగించారు.మత్తులో ఉన్న నరేశ్ ఛాతిపై దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ బంకులో పెట్రోల్ తీసుకుని శవాన్ని కాల్చి కాలువలో పడేసి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు హైదరాబాద్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక బైక్, మొబైల్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో కీలక సమాచారo అందించిన నేరల్ యువకుడిని ఎస్పీ ప్రశంసించారు.