08-07-2025 12:31:02 AM
- అందుకు అవకాశం ఇవ్వండి
- సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖ సినీనటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు కు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం కలిశారు.
ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ స్టూడి యో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను, వివిధ రంగాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి అజయ్ దేవగణ్‌కు వివరించారు.
తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచా రకర్తగా ఉంటానని అజయ్ దేవగణ్ సీఎంకు తెలియజేశారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.