29-11-2025 12:55:53 AM
-ప్రమాదాలు సంభవిస్తే గద్వాల, అలంపూర్ చౌరస్తా నుంచి సిబ్బంది రావాల్సిన దుస్థితి
-సకాలంలో ఫైర్ సిబ్బంది చేరుకోలేక పూర్తిగా దగ్ధమయ్యే పరిస్థితి
అయిజ, నవంబర్ 28: అలంపూర్ పరిధిలోని అతి పెద్ద మున్సిపాలిటీ కేంద్రం అయిజ పట్టణం. పట్టణ జనాభాతో పాటు పరిసర గ్రామాల జనాభా నిష్పత్తి కూడా ఎక్కువే. వాణిజ్య పరంగా అన్ని సౌకర్యాలు కలిగి నిత్యం జన సంచారంతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు, పలు ప్రైవేట్ స్కూల్స్, ఆసుపత్రులు ఉన్నాయి. ముఖ్యంగా పంటలతో సాగుతో పాటు పశు సంపద కూడా అధికంగా ఉంటుంది.
దీంతో రైతులు గ్రామాల్లో పశువుల కోసం మేత సేకరించి కల్లాలో గడ్డి వాములను ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాక అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి కర్ణాటక, ఏపీ బార్డర్ కావడంతో నిత్యం వందలకొద్దీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ఉన్న ఫైర్ స్టేషన్ లేక ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగే అవకాశాలు
అయిజతో పాటు పరిసర ప్రాంతాలలో అనుకోకుండా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో మంటలను అదుపు చేయలేక ప్రాణ ఆస్తి నష్టాలు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నట్లు ప్రజలు వాపోయారు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించిన దాదాపు గద్వాల నుంచి 30.. అలంపూర్ చౌరస్తా 40 కిలోమీటర్ల మేర దూరంలో ఉండడంతో ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోలేక అగ్నికి ఆహుతి అయ్యే పరిస్థితులు తలెత్తితే అవకాశాలు ఉన్నాయి.
అయిజ మండలానికి చుట్టూ రాజోలి, వడ్డేపల్లి మరియు గట్టు, మల్దకల్ లోని కొన్ని గ్రామాలు కలిపి సుమారుగా 90 గ్రామాలు దరిదాపులలో ఉన్నాయి. అయిజలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే సకాలంలో ప్రమాదాలను కొంతవరకు అరికట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే తుప్పత్రాల గ్రామంలో రెండు గడ్డి వాములు అగ్నికి దగ్ధమయ్యాయి.
ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు పలుమార్లు విన్నవించినా శూన్యం
అయిజ మున్సిపాలిటీ కేంద్రంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గత 20 ఏళ్ల నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వినతి పత్రాలు అందజేసిన ఇప్పటి స్పందన లేదు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతున్న ఈ ప్రాంత ప్రజలపై నాయకులకు చిత్త శుద్ధి లేదని, ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త చిన్నతాండ్రపాడు సుధాకర్ గౌడ్ అన్నారు.