05-12-2025 01:22:37 AM
ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తోపాటు త్రిగుణ్ హీరోలుగా నటించిన తాజాచిత్రం ‘ఈషా’. హెబ్బాపటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు కేఎల్ దామోదరప్రసాద్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్న అంశాలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ “ఏడాదికి 200 సినిమాలు వస్తాయి.. వాటిల్లో టికెట్ రేట్లు పెంచాలని కోరే సినిమాలు ఐదారుకు మించి ఉండవు.
మిగతా సినిమాలకు టికెట్ ధరలు పెరగవు. అయినా పైరసీ ఆగడంలేదు. ఐబొమ్మ రవిని ఒక హీరోగా క్రియేట్ చేయడం తప్పు. అతను చేసింది నేరం. ప్రజలు పైరసీ సినిమాలు చూడటం మానేయాలి. దొంగతనం చేయడం ఎంత తప్పో, దొంగ వస్తువులు కొనడం కూడా అంతే తప్పు. పరిస్థితులు త్వరలో మారతాయి.. అందుకు అనుగుణంగా చట్టాలు వస్తాయి” అన్నారు.
బన్నీవాస్ మాట్లాడుతూ ‘పుష్ప2’ ఘటనపై స్పందించారు. ‘పుష్ప2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడికి సహాయం చేసే విషయంలో దిల్ రాజు సహా ఇతర పెద్దలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన తర్వాతే నేను ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నా. ఈ సినిమా చూసి భయపడ్డాను.
డిసెంబర్ 12న అందర్ని భయపెడుతున్నాం” అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ “సినిమా సక్సెస్ కావాలంటే అన్నీ కుదరాలి. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే మాకు మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. దామోదర ప్రసాద్, బన్నీ వాస్, వంశీ నందిపాటి సపోర్ట్‌తో మా సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది” అన్నారు.