06-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుందని, అయితే ఈ రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, పైగా హామీలను అమలు చేయడం బదులు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచం దర్‌రావు తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు.. రెండేండ్లు గడిచినా వాటి అమలులో విఫలమైందని తెలిపారు.
శుక్రవారం ఆయన ఒక ప్రకనటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుభరోసా, చేయూత, యువ వికాసం, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. వాటిలో అంతర్భాగంగా అనేక హామీలను చేర్చిందన్నారు. కౌలు రైతులకు సైతం రూ.12 వేలు, ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం, యువ వికాసం పేరిట విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ వంటి హామీలేవీ అమలు చేయలేదన్నారు.
కాంగ్రెస్ పాలనలో రెండేళ్లుగా అమలు కాని హామీల అమలు కోసం.. ప్రజావంచన కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ ఈ నెల 7న బీజేపీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మహాధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ మహాధర్నాలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పార్టీలో చేరిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెంది న పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. కాంగ్రెస్ మోసాలతో విసుగు చెందిన ప్రజలు.. బీజేపీతోనే న్యాయం జరుగుతుందని పార్టీలో చేరుతున్నారని చెప్పారు.