calender_icon.png 15 December, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాకవి బోయిభీమన్న..

13-12-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప : 

* నేను భీమన్న గారిని స్మృతికి తెచ్చుకున్నప్పుడల్లా వారి కవితా వైశిష్ట్యం నన్ను సమ్మోహితుణ్ణి చేస్తుంది. వట్టిగా చెబితే ఎవరూ వినరని కాబోలు ‘గిలి ్లచెబుతున్నా’ అని ఒక కావ్యం రాశారు. పిల్లిని మకుట స్థానంలో ఉంచి వారి వలె ‘పిల్లీ శతకం’ రాసినవారు లేరు. వారి సాహిత్య సభల్లో నేనెక్కువగా ప్రేక్షకునిగానే పాల్గొన్నాను. మల్లెమాల, సినారె, బాపురెడ్డి గార్లతో కలిసి వారెన్నో కవితాగాన సభలను నిర్వహించారు. 

మహాకవి డాక్టర్ బోయిభీమన్న గారు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కాలనీలో ఉండేవారు. నేను, యెల్దండ రఘమన్నతో పాటు వారి దగ్గరికి తరచుగా వెళ్లేవాణ్ణి. ముగ్గురం వేదాల గొప్పతనాన్ని గూర్చి ముచ్చటించుకునేవాళ్లం. ఆర్షవాఙ్మయం అంటే మా ముగ్గురికీ భలే ఇష్టం. భీమన్నగారు డ్బ్బు దాకా రచనలు చేశారు. వారి సాహిత్యం భారత జాతీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. వారి రచనల్లో ‘రాగ వాశిష్టం’ సామాజిక చైతన్యానికి పట్టుగొమ్మగా నిలిచింది.

‘దీపసభ’ తమస్సు మీద దండయాత్రను చేసింది. ‘త్రిపదలు’ హేతువాద గుళికలు. ‘ధర్మం కోసం పోరాటం’ దళిత చైతన్యాన్ని కలిగిస్తుంది. ‘పడిపోతున్న అడ్డుగోడలు’ సమ సమాజ స్థాపనకు అద్దం పడుతున్నాయి. ‘అకాండ తాండవం’ ఆధ్యాత్మిక చింతనకు దారి చూపెడుతుంది. ‘పాలేరు’ నాటకం విప్లవాత్మక అభ్యదయ భావాలను కలిగిస్తుంది. ‘పంచమస్వరం’ అణగారిన వర్గాల్లో పెను చైతన్యాన్ని నింపుతుంది.

‘జానపదుని జాబులు’లో గ్రామీణ ఆర్థిక స్థితిగతులు ప్రతిఫలించాయి. ‘బొమ్మ’ ప్రణయ కవిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘ఒంటరిగొంతు’ అనంత చైతన్యాన్ని ఆవిష్కరిస్తుంది. ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ పురస్కారం పొందిన ‘గుడిసెలు కాలిపోతున్ను’ రచన.. మానవ సంబంధాల్లో రావలసిన మార్పులను నిర్దేశిస్తుంది. ఇందులో ఒకవైపు పేదల దుస్థితి ని చూపుతూనే, మరోవైపు అందుకు కారణమైన రాజకీయపు కుట్రను బోయి భీమన్నగారు కళ్లకు గట్టినట్లు చిత్రించడం ఆయనకే చెల్లింది. 

పాలేరు నాటకం..

భీమన్నపై ఆర్షకవుల ప్రభావమే గాక, అంబేద్కర్ ప్రభావం ఉంది. అందుకే ఆయన ‘అంబేద్కర్ సుప్రభాతం’ రాశారు. ‘కూలిరాజు’ నాటకం ద్వారా ఒక కూలి రాజ్యాధికారం చేపట్టాలని ఆకాంక్షించారు. భీమన్నగారు రాసిన ‘కూలిరాజు’ నాటకంతో పాటు ‘పాలేరు’ నాటకం వందలసార్లు ప్రదర్శనకు నోచుకున్నది. దళితుల్లో చైతన్యానికి పెద్దపీట వేసింది. భీమన్న గారి ‘అంబేద్కరిజం’ అనే గ్రంథం సమాజంలో వేళ్లూనుకొని ఉన్న ఎన్నో మౌలికాంశాలను స్పృశిస్తుంది.

కవిగా, నాటక కర్తగా, నవలాకారునిగా భీమన్న తెలుగు సాహిత్యంలో చిరకీర్తిని ఆర్జించారు. తన 80 ఏళ్ల జీవితంలో ఎవరికీ తలవంచని ధీరునిగా నిలిచారు. పద్య, వచన, గేయ, సంగీత, నృత్య, లేఖ, వ్యంగ్య, రూపక సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ప్రవేశించి అద్వితీయమైన ప్రతిభను చూపారు. ఆ విధంగా ఆయన ‘పద్మభూషణు’డయ్యారు. 

సమసమాజ స్థాపన..

నేటి సమాజంలోని అసమానతలే బోయిభీమన్న సాహిత్య సృష్టికి కారణమయ్యాయి. ‘ఈ అసమానతలెక్కడి నుంచి వచ్చాయి? వేదాల్లోనూ, ఉపనిషత్తులోనూ, ఆర్ష వాఙ్మయంలోనూ కనిపించని సామాజిక అసమానతలకు కారణా లేంటి? అని ప్రశ్నలు వేసుకొని, వాటి కారణాలను విశ్లేషించి సాహిత్యం ద్వారా సమసమాజ స్థాపనకు కంకణం కట్టుకున్న గొప్ప మహనీయుడు భీమన్న!. సమాజంలో తరతరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, పేరుకుపోయిన అవినీతి, స్వురై విహారం చేస్తున్న ధనవంతుల, ధరాధిపతుల విషపూరిత అధికార దర్పం, ప్రపంచానికి అన్నం పెట్టే శ్రామికజీవుల దుర్భర దారిద్య్రం, ఆకలి కేకలతో అలమటించే అన్నార్థుల బాధలు బోయి భీమన్నగారిని ఎంతగానో కలచివేశాయి.

వివిధ ప్రక్రియల్లో అతని కలాన్ని నడిపించాయి. స్వయంగా ఆలోచించే స్వభావం బోయి భీమన్నగారిది. సతార్కికంగా విచారించే జీవిత నేపథ్యం భీమన్నగారిది. అందుకే రాయప్రోలు వారు తెలుగు సాహిత్యంలో ‘అమలిన శృంగారం’ అనే వాదాన్ని తీసుకొని రాగా, వారు అసలు మలినం కాకపోతే అది శృంగారం ఎలా అవుతుందని ప్రశ్నించి, ‘రసాద్వుతైం’ అనే కొత్త వాదాన్ని ప్రతిపాదించారు.

ప్రేక్షకునిగా..

నేను భీమన్న గారిని స్మృతికి తెచ్చుకున్నప్పుడల్లా వారి కవితా వైశిష్ట్యం నన్ను సమ్మోహితుణ్ణి చేస్తుంది. వట్టిగా చెబితే ఎవరూ వినరని కాబోలు ‘గిలి ్లచెబుతున్నా’ అని ఒక అద్బుతమైన కావ్యాన్ని రాశారు. పిల్లిని మకుట స్థానంలో ఉంచి వారి వలె ‘పిల్లీ శతకం’ రాసిన వారు లేరు. వారి సాహిత్య సభల్లో నేనెక్కువగా ప్రేక్షకునిగానే పాల్గొన్నాను. మల్లెమాల, సినారె, బాపురెడ్డి గార్లతో కలిసి వారెన్నో కవితాగాన సభలను నిర్వహించారు.

ఒకసారి ఆంధ్రసారస్వత పరిషత్తులో పాలేరు నాటకానికి 60 ఏళ్లు నిండిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటైంది. ఆ సభకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డిగారు అధ్యక్షులు. సభ ముగింపులో నేను మాట్లాడాను. నా మాటలకు స్పందిస్తూ ‘చెన్నప్ప చిన్నప్ప కాడు, ధన్యవాదాలు చెప్పి చప్పట్లు కొట్టించుకుం టాడు. మంచి భవిష్యత్తు ఉన్నవాడు’ అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో రింగుమని మారు మోగుతూనే ఉన్నాయి.

ఇటీవల బోయిభీమన్న పేరు మీద 25 వేల రూపాయల నగదు పారితోషికంతో కూడిన సాహితీ నిధి పురస్కారం లభించడం నాకు దక్కిన అదృష్టం అని చెప్పవచ్చు. బహుముఖ ప్రజ్ఞావంతుడైన బోయిభీమన్న పేరు మీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘బోయి భీమన్న సాహితీ పీఠం’ ఏర్పాటు చేసింది. తెలుగు యూనివర్సిటీ ప్రథమ విశిష్ట సాహితీ పురస్కార గ్రహీత బోయిభీమన్న గారే కావడం విశేషం. రాజ్యలక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకున్న భీమన్న గారికి 1993లోనే నాగార్జున విశ్వ విద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసింది.

 వ్యాసకర్త సెల్: 9885654381