12-10-2025 01:07:05 AM
ఆస్ట్రేలియాతో భారత మహిళల పోరు lవిశాఖ వేదికగా మ్యాచ్
విశాఖపట్నం, అక్టోబర్ 11: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అసలు సిసలు సమరానికి సిద్ధమైంది. ఆదివారం విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా రెండు గెలిచి జోరు మీద కనిపించిన భారత జట్టు సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. గెలిచే మ్యాచ్‌ను పేలవమైన డెత్ బౌలింగ్‌తో చేజార్చుకుంది.
ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఓడించి సొంతగడ్డపై మళ్ళీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. నిజానికి ఈ టోర్నీలో భారత మహిళల జట్టు టాపార్డర్ ఫామ్ ఆం దోళన కలిగిస్తోంది. కెప్టెన్ హర్మన్, స్మృతి అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. వీరిద్దరితో పాటు హర్లీన్ డియోల్,జెమీమా కూడా సత్తా చాటాల్సిందే. సౌతాఫ్రికాపై టాపార్డర్ వైఫల్యం చెందినా వికెట్ కీపర్ రిఛా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి పరువు నిలిపింది.
దీంతో కంగారూలపై ఎట్టిపరిస్థితుల్లోనూ స్టార్ బ్యాటర్లు రాణించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్‌లో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ రాణిస్తున్నారు. అయితే డెత్ బౌలింగ్ మాత్రం ఆందోళనకరంగా ఉంది.గత మ్యాచ్‌లో డెత్ బౌలింగ్‌లో చేతులెత్తేయడంతోనే విజయం చేజారింది.పైగా ఈ సారి ఆసీస్ లాంటి పటిష్ట జట్టుపై మరింత జాగ్రత్తగా బౌలింగ్ చేయకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
మరోవైపు పాకిస్తాన్‌పై 100 పరుగులలోపే 7 వికెట్లు కోల్పోయినా బెత్ మూనీ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్ గెలిచి ఆసీస్ తమ సత్తా నిరూపించుకుంది. పలువురు ఆల్‌రౌండర్లు కంగారూలకు ప్రధాన బలం. ఇటీ వల వన్డే సిరీస్‌లోనూ భారత్‌పై ఆసీస్‌దే పైచేయిగా నిలిచింది. ఇక విశాఖ పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుండడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది.