12-10-2025 12:43:54 AM
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 11: బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలీ భవన్ గోడను ఆనుకుని ఉన్న సౌత్ క్రాస్ కట్ గని భూమిని దేవుడి పేరుతో కబ్జా చేయడం సరైనది కాదని అఖిలపక్షం నాయకులు అన్నారు. ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన అఖిల పక్షాలు శనివారం సమావేశమయ్యాయి. అనంతరం ఆక్రమిత భూమి వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను, పద్మశాలి భవన్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన రెండు గేట్లను పరిశీలించారు.
అంతకు ముందు సీపీఐ కార్యాలయంలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ.. సింగరేణి, ప్రభుత్వ భూములు కబ్జాకు రియల్ ఎస్టేట్ మాఫియా పూనుకోవడాన్ని ఖండించారు. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాకాకుండా అఖిలపక్షం కాపాడుకుంటుందన్నారు.
ఎమ్మెల్యే, యాజమాన్యం ఈ భూమి కబ్జా కాకుండా చూడాల్సిందిగా కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మని రాంసింగ్ మాట్లాడుతూ.. ఇది అబెండెడ్ మైన్ అంటే నిషేధిత ప్రాంతం కనుక ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. సింగరేణి యాజమాన్యం ఇట్టి భూమిని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి కబ్జాదారుల నుంచి రక్షించవలసిన అవసరం ఉందన్నారు.
సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోగర్ల శంకర్ మాట్లాడుతూ.. పద్మశాలీ సంఘం పేరుపైన గుడి కట్టి దాని వెనకాలే ట్రస్ట్ పేరుతో ఫంక్షన్ హాల్ కట్టి వ్యాపార దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య మాట్లాడుతూ పద్మశాలి భవన్ ట్రస్ట్ సభ్యులు భూమి కబ్జాలపై తహతహలాడుతున్నారని ఈ కబ్జాని అఖిల పక్షం వ్యతిరేకిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరామ్ మాట్లాడుతూ.. పద్మశాలీ భవన్ నుంచి గని భూమిలోకి రావడానికి వేసిన గేట్లను వెంటనే మూసివేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ వార్డు అధ్యక్షులు ప్రవీణ్, సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.