3 July, 2026 | 1:09 AM

రైస్‌మిల్స్, గోడౌన్ల యజమానులుగా మహిళా సంఘాలు

03-07-2026 12:00 AM

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

నాగర్ కర్నూల్, జూలై 2 (విజయక్రాంతి): మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్స్, గోడౌన్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించేలా చర్యలు చేపట్టిందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం చారకొండ మండల కేంద్రంలో మహిళా సంఘాల గోడౌన్ల నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

మహిళా సంఘాలు రైస్ మిల్స్, గోడౌన్ల యజమానులుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఈ పథకం కింద మహిళా సంఘాలకు భూముల కేటాయింపుతో పాటు ఆర్థిక సహాయం, సబ్సిడీలు అందజేస్తోందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా మహిళా సంఘాలే నిర్వహణ చేపట్టి ఆదాయం పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

మహిళలు వ్యాపార రంగంలో స్థిరపడుతూ స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.