24-11-2025 12:21:36 AM
ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో పాల్గొన్న చైర్మన్
సంగారెడ్డి, నవంబర్ 23(విజయక్రాంతి):మాట ఇస్తే, ఆ మాట తప్పకుండా నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ తత్వమని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహతో కలిసి ఆమె పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
అనంతరం వారిని ఉద్దేశించి టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుపడుతుందని, ఆ దేశం అన్ని విధాలుగా ఎదుగుతుందని అన్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి సంక్షేమ పథకాలు అన్నింటిలోనూ మహిళలనే లబ్ధిదారులుగా చేరుస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
ఇందిరమ్మ చీరలు కొందరికే పంపిణీ చేస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావన్నారు. ప్రతి మహిళకు చీర అందిస్తామన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మహిళలు తమ రాజకీయ చైతన్యం చాటాలన్నారు. తాను టీజీఐఐసీ ఛైర్ పర్సన్ గా వున్నానని, పది నుంచి 15 మంది మహిళలు కలిసి పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
పరిశ్రమల స్థాపనతో మహిళలు ఈ రంగంలోనూ రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఫహీం, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సీడీసీ ఛైర్మన్ గడీల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.