calender_icon.png 7 May, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో సరస్వతి పుష్కరాలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

06-05-2025 09:23:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సరస్వతీ పుష్కరాలలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం అందజేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రి ఆహ్వానం అందించారు. 15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్ల గురించి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంగళవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కరాల్లో హెలికాప్టర్‌ (Helicopter) ప్రయాణం అందుబాటులోకి రానుంది. పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్ల చుట్టూ ఉన్నట్టు వంటి పచ్చటి అందాలను గగనతలం నుంచి వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం జాయ్ రైడ్ ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఒకేసారి ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా ఎయిర్ బస్ హెచ్-125 మోడల్ హెలికాప్టర్ ను వినియోగించనుంది. టికెట్‌ ధరను ఒక్కొక్కరికీ రూ.4,500 చొప్పున ఖరారు చేయగా.. ప్రయాణ సమయాన్ని 6-7 నిమిషాలుగా నిర్ణయించారు.