calender_icon.png 9 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ ప్రజలను అన్ని రంగాల్లో ముందుంచడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం

09-08-2025 07:28:33 PM

ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్..

కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు..

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు పోలీస్ అధికారులు,ఆదివాసీ నాయకులు, స్థానికులతో భారీ ర్యాలీ నిర్వహణ..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) ఆదేశాల మేరకు శనివారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుండి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కొత్తగూడెం డిఎస్పి రెహమాన్  ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు, ఆదివాసీ నాయకులు, ప్రజలు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసి జిల్లాగా పేరొందిన భద్రాద్రి జిల్లాలో నివసించే ఆదివాసి ప్రజలు అన్ని రంగాల్లో ముందుండేలా చూడడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు.

ఇందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల కోసం ప్రభుత్వం తరఫున జిల్లా పోలీస్ శాఖ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసి ప్రజలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చర్ల మండలంలోని చెన్నాపురం,పూసుగుప్ప సరిహద్దు గ్రామాల్లో  సుమారుగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు మొబైల్ హాస్పటల్ లను, దుమ్ముగూడెంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను,పూసగుప్ప నుండి చత్తీస్గడ్ సరిహద్దు వరకు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డును సుమారుగా మూడు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగిందన్నారు.

ఏజెన్సీ ప్రాంత యువతకు ఉపయోగపడే విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పోలీస్ శాఖ సహకారంతో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పునరావాస పాలసీకి ఆకర్షితులై ఈ సంవత్సర కాలంలో సుమారుగా 300 మందికి పైగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోవడం జరిగిందన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు అండగా ఉంటూ వారి సంక్షేమం,అభివృద్ధి కొరకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం జిల్లాలోని ఆదివాసీ కుటుంబాల నుండి ఉద్యోగాలలో చదువులో ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా సహాపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్టౌన్ సిఐ కరుణాకర్, 3 టౌన్ సీఐ శివ ప్రసాద్ పాల్గొన్నారు.