09-08-2025 10:23:25 PM
హన్మకొండ (విజయక్రాంతి): హన్మకొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామనా ఘనంగా రక్షాబంధన్(Raksha Bandhan) వేడుకలు జరుపుకున్నారు. రక్షాబంధన్ అంటేనే అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెల అనురాగం, మమకారంతో ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రేమని తీలకంగా పెట్టి రాఖీని రక్షగా కట్టి మంగళ హారతిని ఆశీస్సులుగా ఇచ్చి నోటిని తియ్యగా చేసి ఆనందించే వనితే సోదరీ. ఏడాదికోమారు వచ్చే అక్కా తమ్ముళ్ల, అన్నా చెల్లెళ్ల అపురూప కలయిక ఆప్యాయతనురాగాల పొందిక పవిత్ర బంధాల మేళవింపు. ప్రకాశించే రాఖీ కిరణాల సొంపు. భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాల వేదికగా ఇంటింట్లో వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎక్కడెక్కడో ఉండే సోదరీ మణులు తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తారు. అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్ది కానుకలు ఇస్తారు. ఒకరికొకరు తీపి తినిపించుకొని అను బంధాన్ని పంచుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కులాలకు, మతాలకు అతీతంగా రాఖీలు కట్టి మతసామరస్యాన్ని నిలుపుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.