calender_icon.png 10 August, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి కుటుంబానికి భరోసా కావాలి

09-08-2025 10:12:37 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అమరరాజ కంపెనీ మహబూబ్ నగర్ లోని వేల మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఎదిర ఐటి పార్క్ ఆవరణలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో 3వ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను అమర రాజ బ్యాటరీ కంపెనీ రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

భవిష్యత్తులో ఎన్నో వేలమంది స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఈ అమరరాజ కంపెనీ కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ రోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మహబూబ్ నగర్ యువతకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్య శిక్షణ, మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఇక్కడ ఇచ్చే నైపుణ్యశిక్షణ కేవలం  అమరరాజ కంపెనీ కోసమే కాకుండా ఇక్కడ శిక్షణ పొందిన వారు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందే విధంగా శిక్షణ ఇవ్వాలని ఫౌండేషన్ సభ్యులకు సూచించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళికతో మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా, మెడికల్ హబ్ గా, ట్రాన్స్ పోర్ట్ హబ్ గా అభివృద్ధి చేయుట కొరకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు, అందులో భాగంగా మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయుటకు ఇప్పటికే మహబూబ్ నగర్ కు ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల ఐఐఐటి కళాశాల మంజూరు చేశారని అలాగే ఐటిఐ కళాశాల ను ఎటిసి సెంటర్ గా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో  ఇన్ఫోసిస్ సహాకారం తో స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇప్పించడం తోపాటు మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ శిక్షణ తరగతులను నిర్వహించడం టాస్క్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేశారు.   

రానున్న పది సంవత్సరాలలో కనీసం 20 వేల మంది నైపుణ్య శిక్షణ పొందేటట్లు తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు శిక్షణ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, టాస్క్ సిఇవో  సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ జయకృష్ణ, ఓఎస్ఎస్ఐ సిఇఒ సలీం అహ్మద్, నాయకులు అజ్మత్ అలి, అవేజ్, హన్మంతు, శివశంకర్,  రాషెద్ ఖాన్, ఖాజా పాషా, మోసిన్, శివప్రసాద్ రెడ్డి, జే.చంద్రశేఖర్, చర్ల శ్రీనివాసులు, అనుప ఆంజనేయులు, సిరిగిరి మురళీధర్, గ్యాస్ అంజి తదితరులు పాల్గొన్నారు.